కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత అందరినీ అల్లాడిస్తోంది. హాస్పిటల్స్ లో తగినంతగా ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో కొవిడ్ పేషంట్స్ కన్నుమూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఫిల్మ్ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందిస్తున్నారు. మరికొందరు కరోనాకు సంబంధించిన బాధితుల సమాచారాన్ని వీలైనంత మందికి తెలియచేయడానికి సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు. అయితే ప్రముఖ నటుడు హర్షవర్థన్ రాణే మరో అడుగు ముందుకేశాడు. కరోనా బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఆదుకొనేంత స్థోమత తనకు లేదని, అయితే… ఆక్సిజన్ లేక మరణిస్తున్న వారిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని హర్షవర్థన్ రాణే అంటున్నాడు. అందుకే తాను ఎంతో ఇష్టపడే బైక్ ను అమ్మేసి… కొంతమందికైనా ఆక్సిజన్ ను అందించే ప్రయత్నం చేస్తానంటున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన హర్షవర్థన్… ఎవరైతే ఎక్కువమందికి ఆక్సిజన్ అందిస్తారో వారికి తన బైక్ ఇచ్చేస్తానని తెలిపాడు. మరి ఇటు మనిషి ప్రాణాలు కాపాడుతూ, హర్షవర్థన్ రాణే బైక్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే 2010లో ‘తకిట తకిత’తో నటుడిగా తెరంగేట్రమ్ చేసిన హర్షవర్థన్ రాణే పలు తెలుగు చిత్రాలలో నటించిన తర్వాత 2016లో ‘సనమ్ తేరీ కసమ్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ రెండు మూడు సినిమాలలో నటిస్తున్నాడు.