పగలే వెన్నెలలు కురిపించిన గానం – అవనినే పులకింపచేసిన గాత్రం – జలతరింగిణికి దీటైన గళం – ఒక్కమాటలో చెప్పాలంటే పంచభూతాలనే పరవశింపచేసే గాత్రం ఎస్. జానకి సొంతం. ఆమె పాటలోని మాధుర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఒక్కసారి జానకమ్మ పాటతో సాగితే, మళ్ళీ మళ్ళీ పయనించాలనిపిస్తుంది. ఆమె పాటను మననం చేసుకున్న ప్రతీసారి మధురం మన సొంతమవుతుంది. మనకు పరమానందం పంచిన జానకమ్మ పాటలో ఎంత మాధుర్యం ఉంటుందో, ఆమెలో అదే స్థాయి ఆత్మవిశ్వాసమూ ఉంది. అందువల్లే తనదైన రీతిలో ఆత్మగౌరవమూ ప్రదర్శించగలిగారు. ఆమె గానానికి 2013లో కేంద్రం ‘పద్మభూషణ్’ ఇస్తామంటే, తన పాటకు ‘భారతరత్న’ ఒక్కటే సరితూగుతుందని తెగేసి చెప్పిన ధైర్యం కూడా జానకమ్మ సొంతం.
పువ్వు పుట్టగానే…
గానకోకిలగా జేజేలు అందుకుంటున్న జానకమ్మ 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా వల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి శిష్ట్లా శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యం కూడా తెలిసిన వారు. ఇక లలితకళల్లోనూ ఆయనది అందెవేసిన చేయి. తండ్రి జీన్స్ కారణంగానేమో చిన్నారి జానకి మూడేళ్ళ ప్రాయం నుండే పాటలు రాగయుక్తంగా ఆలపించడం ఆరంభించారు. తన సీనియర్ గాయనీమణులు పాడిన పాటలను రేడియోలోనూ, గ్రామఫోన్ రికార్డుల ద్వారా వింటూ సాధన చేశారు జానకి. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్నారు. మేనమామ సలహా మేరకు మద్రాస్ చేరి అక్కడ తొలుత ఏవీయమ్ స్టూడియోలో తన గానం వినిపించారు. స్టూడియోవారు ఆమె పాట మెచ్చి, తమ స్టాఫ్ గా ఉద్యోగం ఇచ్చారు. ఏవీయమ్ సంస్థ నిర్మించే చిత్రాలకు బిట్ సాంగ్స్, కోరస్ పాడుతూ ఉండేవారు జానకి. అదే సమయంలో మన తెలుగు సంగీత దర్శకులు టి.చలపతిరావు ‘విధియిన్ విలయాట్టు’ అనే తమిళ చిత్రానికి స్వరకల్పన చేస్తున్నారు. ఆయన సంగీత నిర్దేశకత్వంలో తొలిసారి జానకి సినిమా పాట పాడారు. అలా తమిళపాటతో జానకమ్మ గానపర్వం మొదలయింది.
పాటల పర్వంలో…
తరువాత పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చిన ‘ఎమ్.ఎల్.ఏ.’ తెలుగు చిత్రంలో ఘంటసాలతో కలసి “నీ ఆశ అడియాస…చెయిజారే మణిపూస…” పాటను ఆలపించారు. ఈ సినిమాతో తెలుగునాట జానకి గానానికి భలే ఆదరణ లభించింది. జానకమ్మ గళంలోని మాధుర్యం మెచ్చి ఎందరో సంగీతదర్శకులు తమ చిత్రాల్లో అవకాశాలు కల్పించారు. జగ్గయ్య ‘ముందడుగు’లోని “కోడెకారు చిన్నవాడా…” సాంగ్ తో జానకి పేరు మరింత మారుమోగింది. యన్టీఆర్ ‘దేవాంతకుడు’లోనూ జానకి పాడిన పాటలు అలరించాయి. దాంతో తన దర్శకత్వంలో రూపొందిన ‘గులేబకావళి కథ’లో “కలల అలలపై తేలె…”, “సలామలేకుం సాయెబుగారు…”, “నీ ఆటలింక సాగవు…” వంటి పాటలు జానకితో పాడించారు. ఆ పాటలు కూడా తెలుగువారిని భలేగా ఆకట్టుకున్నాయి. ఇక సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో ‘నర్తనశాల’ చిత్రం కోసం జానకి పాడిన “నరవరా ఓ కురువరా…” పాట తెలుగునేలను పరవశింపచేసింది. ఏయన్నార్ ‘పూజాఫలం’లో జానకి పాడిన “పగలే వెన్నెల జగమే ఊయల…” సాంగ్ నిజంగానే సంగీతప్రియులను ఊయలలూపింది. గాయనిగా జానకమ్మ కొన్ని సవాళ్ళనూ ఎదుర్కొన్నారు. ‘మురిపించే మువ్వలు’ చిత్రంలో అరుణాచలం సన్నాయితో పోటీపడి “నీ లీల పాడెద దేవా…” గీతం ఆలపించి, అందరినీ అచ్చెరువొందేలా చేశారు. నిజానికి ఈ పాటలో నటించిన సావిత్రి తొలుత జానకి వంటి వర్ధమాన గాయనితో పాట పాడించడాన్ని వ్యతిరేకించారట! అయితే దానినే ఓ ఛాలెంజ్ గా తీసుకున్న జానకి తనదైన గాత్రమహిమతో మెప్పించారు. తెలుగునాటనే కాదు, తమిళ, కన్నడ, మళయాళ సీమల్లోనూ జానకమ్మ పాట జేజేలు అందుకుంది. ఉత్తరాదిన సైతం జానకి పాట పరవశింప చేసింది.
అభిమానమే అసలైన అవార్డు…
జానకి పాటకు ఆ రోజుల్లో ఎందరో సంగీత ప్రియులు అభినందన జల్లులు కురిపించారు. ‘పన్ మాస్టర్’గా ప్రఖ్యాతి గాంచిన చంద్రశేఖర్ తనయుడు వి.రామ్ ప్రసాద్ ను జానకి 1959లో పెళ్ళాడారు. వారికి ఓ తనయుడు పేరు మురళీకృష్ణ. జానకమ్మ పాటకు పలు రాష్టప్రభుత్వాలు పట్టంక ట్టాయి. తెలుగునాట పది నంది అవార్డులు జానకమ్మ సొంతమయ్యాయి. అవార్డుల్లో ఉత్తరాది, దక్షిణాది అనే భేదం చూపించడాన్ని జానకమ్మ తొలి నుంచీ వ్యతిరేకించారు. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టాలన్నది ఆమె భావన. అందుకు 2013లో అప్పటి కేంద్రప్రభుత్వం జానకమ్మకు ‘పద్మభూషణ్’ అవార్డు ఇవ్వాలని ప్రయత్నిస్తే, ఆమె దానిని తిరస్కరించారు. భారతమంతటా అభిమానులు ఎంతగానో తనను గౌరవిస్తున్నారని, అంతకంటే ఏ అవార్డు కావాలని ఆమె అంటారు. ఆ మధ్య ’96’ సినిమాలో ఓ సీన్ లో జానకమ్మ కనిపించారు కూడా. 83 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జానకమ్మ ఈ నాటికీ అభిమానుల మదిలో ‘గానకోకిల’గానే నిలచి ఉన్నారు. ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ మరింత ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.