Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!

Kona Venkat

Kona Venkat

Kona Venkat: చిన్న సినిమాలు తీయడం ఒక ఎత్తయితే.. వాటిని థియేటర్ల దాకా తెచ్చి, ఓటీటీ డీల్స్ కుదుర్చుకోవడం నేటి రోజుల్లో నిర్మాతలకు పెద్ద సాహసమే. అయితే షూటింగ్ మొదలుపెట్టకముందే గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు సినిమాను అమ్మేసి సెట్స్ పైకి వెళ్లడం ఎక్కడైనా చూశారా? సరిగ్గా అలాంటి అరుదైన ఫీట్‌తో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది ‘హైకూ’ చిత్రం. ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డా.డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించిన ‘హైకూ’ అక్టోబర్ 23న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కోన వెంకట్ చిత్ర యూనిట్‌ గురించి మాట్లాడారు. “హైకూ సినిమా ట్రైలర్ చూడగానే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా అనిపించింది. అసలు సినిమా తీయకముందే.. కేవలం కథ చెప్పి నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేయడం, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టడం నిజంగా మామూలు విషయం కాదు. అంత పెద్ద ఓటీటీ సంస్థకు స్క్రిప్ట్ ఎంతగా నచ్చితే అలా ముందే కొనుగోలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరినీ మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే పక్కా సిన్సియర్ లవ్ స్టోరీ ఇది” అని కోన వెంకట్ వెల్లడించారు.

ప్రేమలో ఉండే మాధుర్యంతో పాటు అందులోని కాంప్లికేషన్స్, రిలేషన్‌షిప్స్‌లో వచ్చే ఒడిదుడుకులను చాలా నేచురల్‌గా ఈ సినిమాలో చూపించినట్లు చిత్ర బృందం తెలిపింది. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే మనసుకు బాగా కనెక్ట్ అయిపోయి ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేశానని, ప్రేమలో ఉన్నవారితో పాటు పెళ్లైన జంటలకు కూడా ఈ కథ తప్పకుండా నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. హీరో ఏగన్ మాట్లాడుతూ.. తామంతా ఎంతో కష్టపడి మనసుపెట్టి చేసిన సినిమా ఇదని, సంగీత దర్శకుడు సిద్దు కుమార్ అద్భుతమైన పాటలు ఇచ్చారని, కచ్చితంగా హైదరాబాద్‌లో మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. తమిళంలో తెరకెక్కిన ఈ అందమైన కథ తెలుగులోకి రావడం సంతోషంగా ఉందని, హీరోయిన్ శ్రీదేవి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందని కొనియాడారు. కేవలం కంటెంట్ బలాన్ని నమ్ముకుని, షూటింగ్‌కు ముందే ఓటీటీని సైతం మెప్పించిన ఈ ‘హైకూ’ వెండితెరపై యూత్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.