మహిళల రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు శానిటరీ హైజీన్ కిట్లను అందించాలనే లక్ష్యంతో ‘గుర్తుకొస్తున్నాయి – మ్యూజిక్ ఫర్ ఎ కాజ్’ పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించనున్నారు. సంగీతాన్ని సామాజిక సేవతో మేళవిస్తూ నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమం జూలై 18న సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమంలో జరగనుంది.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించే ప్రతి టికెట్ ఆదాయం అవసరమైన బాలికలకు మూడు నెలల పాటు సరిపడే హైజీన్ కిట్లను అందించేందుకు వినియోగించనున్నారు. “ఒక టికెట్ – ఒక బాలికకు మూడు నెలల శానిటరీ హైజీన్ కిట్” అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ముందుకు తీసుకెళ్తున్నారు. శానిటరీ ప్యాడ్స్ విలాసవంతమైన వస్తువు కాదని, ప్రతి మహిళకు అవసరమైన ప్రాథమిక హక్కు అనే సందేశాన్ని సమాజానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
సామాజిక బాధ్యతతో పాటు సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించే ఈ ఈవెంట్‌లో పలువురు సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, గౌరవప్రదమైన జీవనానికి చేయూత అందించాలనే లక్ష్యంతో నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులతో ఈ సమాచారాన్ని పంచుకోవడంతో పాటు కార్యక్రమానికి హాజరై తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. ప్రతి చిన్న సహాయం కూడా ఒక బాలిక జీవితంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని వారు తెలిపారు. టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తి ఉన్నవారు District by Zomato మరియు Socioo.in వేదికల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ సమాజానికి మేలు చేసే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

