Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్

Director Gowri Naidu

Director Gowri Naidu

Director Gowri Naidu: జీవితంలో తీవ్ర నిరాశ ఎదురైనప్పుడు.. ఇక దేవుడిని కూడా నమ్మే పరిస్థితి లేని సమయంలో ఒక అద్భుతం జరిగితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి సినిమాటిక్ ట్విస్ట్ నిజ జీవితంలో ఎదురైందంటూ ‘గరివిడి లక్ష్మి’ దర్శకుడు గౌరినాయుడు జమ్ము చాలా భావోద్వేగంతో పంచుకున్నారు. ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. ఈ సినిమా ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ గౌరినాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. “కథ రాసుకున్నాక ఎన్నో నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగాను. కథ బాగుంది కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమా మేము చేయలేమని చాలామంది తిరస్కరించారు. మరికొందరేమో సగం బడ్జెట్ పెడతాం.. ఇంకెవరినైనా భాగస్వామిని తీసుకురండి అని చెప్పారు. ఆ సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లి కథ చెప్పాను. అప్పటికే వాళ్లు దాదాపు 150 కథలు విన్నారట. నా కథ చెప్పి ఊరికి వెళ్లిపోయాను. రెండు నెలలైనా ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఈ సినిమా రాదేమో, వేరే కథ రాసుకుందామని తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాను” అని చెప్పారు.

ఆ సమయంలో అసలైన గరివిడి లక్ష్మి ఆయనకు కొండంత ధైర్యాన్నిచ్చారని గౌరినాయుడు తెలిపారు. “లక్ష్మమ్మ గారే నా దగ్గరకు వచ్చి.. ‘నాన్నా, నువ్వు ఇంత కష్టపడి రాశావు, ఈ కథ కచ్చితంగా సినిమాగా మారుతుంది. శ్రీకాకుళంలోని రాజులమ్మ తల్లి గుడికి వెళ్లి ఆఖరి ప్రయత్నంగా మొక్కుకుందాం రా’ అన్నారు. ఆ సమయంలో నాకు దేవుడిపై కూడా నమ్మకం పోయింది. అయినా ఆమె మాట కాదనలేక ఇద్దరం గుడికి వెళ్లి అమ్మవారి ముందు కళ్లనిండా నీళ్లతో చేతులు జోడించి మొక్కుకున్నాం. దర్శనం అయ్యాక ఆవిడను బైక్‌పై ఎక్కించుకుని తిరిగి బయలుదేరాను. మేము గుడి దాటి రోడ్డుపైకి రాగానే నా జేబులో ఫోన్ మోగింది. బండి పక్కన ఆపి చూస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కాల్, ‘మీ కథ ఓకే అయింది.. సినిమా చేస్తున్నాం, అడ్వాన్స్ తీసుకోవడానికి ఆఫీస్‌కు రండి’ అని చెప్పారు. ఇది నిజంగా నా జీవితంలో జరిగిన అతిపెద్ద మిరాకిల్. నమ్మలేని ఆ క్షణంలో ఇద్దరం రోడ్డు మీదే ఎమోషనల్ అయి ఏడ్చేశాం. గుడికి వెళ్లి ఆఖరి ఛాన్స్ అని మొక్కడం.. రోడ్డుపైకి రాగానే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ రావడం దైవ సంకల్పం కాకపోతే మరేంటి?” అంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ధైర్యం చేసి నిలబడబట్టే ఈ కళ వెలుగులోకి వచ్చిందని దర్శకుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన పాత్ర పోషించిన తెలుగమ్మాయి ఆనంది నటన గురించి మాట్లాడుతూ.. “ఆనంది గారు గరివిడి లక్ష్మి పాత్రకు ప్రాణం పోశారు. తెరపై లక్ష్మమ్మ యాస, ఆమె ఆట చూస్తుంటే సాక్షాత్తూ ఆవిడే దిగివచ్చినట్లుందని ఉత్తరాంధ్ర ప్రజలు చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు” అని గౌరినాయుడు అన్నారు. ఈ సినిమాలో షకలక శంకర్, రాఘవ్ మయూర్, నరేష్, రాశి, ఎల్బీ శ్రీరామ్ వంటి నటీనటులు ప్రాణం పెట్టి పనిచేశారని పేర్కొన్నారు. పడిపోయిన ఆడపిల్ల సమాజంలో మళ్లీ ఎలా గెలవగలదో చూపించే ఈ సినిమా ప్రతి గడపకూ చేరాలని, సినిమా చూసి థియేటర్ల నుంచి బయటకు వస్తూ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతుంటే జీవితం ధన్యమైనట్లు అనిపిస్తోందని దర్శకుడు ఎమోషనల్ అయ్యారు.