పరిచయం అక్కర్లేని పేరు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్. ఇప్పటివరకు ఈయన నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. అయినా కానీ తెలుగు ప్రేక్షకులలో రణ్‌బీర్‌పై ఎనలేని అభిమానం ఉంది. ఇటీవలే వైజాగ్‌లో జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో అది రుజువైంది కూడా. రణ్‌బీర్ కూడా తెలుగు ప్రేక్షకులు తనను అంతగా ఆదరిస్తారని అనుకొలేదని స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సంజూ’ తరువాత దాదాపు నాలుగేళ్ళకు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రణ్ బీర్. దాంతో బాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తాజాగా ఈ చిత్రం నుండి రణ్‌బీర్ పోస్టర్ లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులందరు ఆ పిక్‌ను షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.
ఈ పోస్టర్‌లో రణ్‌బీర్ గుబురు గడ్డంతో, చేతిలో గొడ్డలి పట్టుకుని ఇంటెన్సీవ్ కళ్లతో చూస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై తీవ్ర ఆసక్తిని పెంచుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియోలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్ర కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, వాణీ కపూర్‌లు కీలకపాత్రల్లో నటించారు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న విడుదలకానుంది. దీనితో పాటుగా ఈయన నటించిన ‘బ్రహ్మాస్త్రం’ కూడా ఇదే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం రణ్‌బీర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.