తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘పర్సెంటేజ్’ వివాదం మరింత ముదిరింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) సబ్ కమిటీ వరుస డ్రాఫ్ట్‌లతో “అంతా సజావుగా సాగుతోంది, ‘పెద్ది’ సినిమాతో పాటు కొత్త విధానానికి అంతా ఒప్పుకున్నారు” అంటూ అంతర్గతంగా సర్క్యులేట్ చేసిన లీక్‌లపై తెలంగాణ ఎగ్జిబిటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్ చెబుతున్నవన్నీ ఏకపక్ష నిర్ణయాలని కొట్టిపారేస్తూ, తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్లు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించి ఛాంబర్ వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
ఛాంబర్ ‘డ్రాఫ్ట్’ డ్రామాలు మాకు వద్దు.. ప్రెస్ మీట్‌లో ఎగ్జిబిటర్లు
ఫిల్మ్ ఛాంబర్ గత కొన్ని రోజులుగా మే 19 నుండి మే 23 వరకు రకరకాల డ్రాఫ్ట్‌లు మారుస్తూ, ఇండస్ట్రీలో అందరూ ఒకే తాటిపైకి వచ్చారని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ఎగ్జిబిటర్లు మండిపడ్డారు. “ఛాంబర్ సబ్ కమిటీలో కొందరు నిర్మాతల ప్రయోజనాల కోసమే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప, గ్రౌండ్ లెవెల్‌లో థియేటర్లు నడుపుతున్న ఎగ్జిబిటర్ల సాధకబాధకాలు పట్టించుకోవడం లేదు” అని వారు బహిరంగంగానే విమర్శించారు.
‘పెద్ది’ రేట్ల పెంపు ఫార్ములాపై తీవ్ర అభ్యంతరం
ఛాంబర్ ప్రతిపాదించిన ‘రేట్ల పెంపు – అదనపు పర్సెంటేజ్’ ఫార్ములాను తెలంగాణ ఎగ్జిబిటర్లు పూర్తిగా వ్యతిరేకించారు.
ఛాంబర్ లీక్ ఏంటి?: టికెట్ ధరలు పెంచితే నెట్ కలెక్షన్లపై 7.5% అదనపు వాటా నిర్మాతలకు ఇవ్వాలి.
ఎగ్జిబిటర్ల కౌంటర్ ఏంటి?: అసలు తెలంగాణలో ప్రతి సినిమాకు టికెట్ ధరలు పెంచుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ప్రభుత్వం రేట్లు పెంచినా, పెరిగిన రేట్ల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. అలాంటప్పుడు వచ్చే అరకొర కలెక్షన్లలో కూడా మళ్లీ 7.5% అదనంగా నిర్మాతలకు ఇచ్చుకుంటూ పోతే థియేటర్ల మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.
ప్రీమియర్ షోల స్లాబ్స్ ఒక మోసం!
ప్రీమియర్ షోల కోసం ఛాంబర్ నిర్ణయించిన రూ. 25,000 (‘A’ సెంటర్), రూ. 15,000 (‘B’ సెంటర్), రూ. 5,000 (‘C’ సెంటర్) ఫిక్స్డ్ స్లాబ్స్ విధానాన్ని ఎగ్జిబిటర్లు తప్పుబట్టారు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, థియేటర్ల సామర్థ్యాన్ని మరియు లోకల్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి ఫిక్స్డ్ రేట్లు రుద్దడం వల్ల ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
జూన్ డెడ్‌లైన్‌పై తెలంగాణ ఎగ్జిబిటర్ల అల్టిమేటం
రాబోయే నెక్స్ట్ భారీ సినిమా లేదా జూన్ 2026 ఆఖరి నాటికి కొత్త పర్సెంటేజ్ విధానాన్ని బలవంతంగా అమలు చేయాలని ఛాంబర్ చూస్తోందని, కానీ నిర్మాతలు పెట్టే ఏకపక్ష కండిషన్స్‌కు తాము లొంగేదే లేదని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టారని, అందుకే ఛాంబర్ పంపిన అంతర్గత ప్రెస్ నోట్ డ్రాఫ్ట్‌లను తాము అంగీకరించడం లేదని ప్రెస్ మీట్ సాక్షిగా ప్రకటించారు. ఛాంబర్ పెద్దలు అంతా సర్దుమణిగింది అని కలరింగ్ ఇస్తుంటే.. ఎగ్జిబిటర్లు మాత్రం ఇండస్ట్రీలో అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందని సంకేతాలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో థియేటర్ల మనుగడ సాగాలంటే ఎగ్జిబిటర్ల డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని, లేదంటే థియేటర్ల బంద్‌కు కూడా వెనకాడబోమని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
