(మే 1న ‘ఎర్రమల్లెలు’కు 40 ఏళ్లు)
తొలి నుంచీ అభ్యుదయ భావాలు కలిగి, వామపక్ష ఆదర్శాల నీడన మసలారు నటుడు, నిర్మాత, దర్శకుడు మాదాల రంగారావు. ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో తెరపై కనిపించిన మాదాల రంగారావు తరువాత మిత్రులతో కలసి నవతరం పిక్చర్స్ నెలకొల్పారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకుడు టి.కృష్ణ వంటివారు ఈ ‘నవతరం’ నీడలో నిలచిన వారే. తొలి ప్రయత్నంగా మాదాల రంగారావు నిర్మించి, నటించిన ‘యువతరం కదిలింది’ చిత్రం మంచి విజయం సాధించింది. పెట్టుబడికి తగిన లాభాలను చూపింది ఆ సినిమా. దాంతో తన వామపక్ష భావాలను మరోమారు పలికిస్తూ మాదాల రంగారావు నిర్మించిన చిత్రం ‘ఎర్రమల్లెలు’. ‘యువతరం కదిలింది’కి దర్శకత్వం వహించిన ధవళ సత్యం ‘ఎర్రమల్లెలు’ కూడా రూపొందించారు. 1981 మే 1న విడుదలైన ‘ఎర్రమల్లెలు’ మరోమారు మాదాలకు విజయాన్ని చవిచూపింది.
ఓ పల్లె, దానికి ఆనుకుని ఉన్న ఓ పట్టణం. ఈ రెండింటిలోనూ కరణం, మునసబు, కామందులు, పరిశ్రమల యజమానులు జనం రక్తం జలగల్లా పీల్చేవారు. పల్లెలో కరణం, మునసబు, కామందు ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉంటారు. ఇక ఫ్యాక్టరీ యజమాని పనిగంటలు పెంచి, వారి శ్రమను దోచుకుంటూ ఉంటాడు. ఎదురు తిరిగిన రంగాను జైలుకు పంపిస్తారు. ప్రశ్నించిన సూరిబాబును పనిలోంచి తొలగిస్తారు. పల్లెకు వచ్చిన పంతులు ప్రజల్లో చైతన్యం రగిలిస్తాడు. ఇక సూరిబాబు న్యాయపోరాటంలో గెలుస్తాడు. పంతులును చంపాలనుకుంటారు. ఊరి జనం తిరగబడతారు. సూరిబాబును చంపిస్తారు. చివరకు జనం అంతా ఒక్కటై రంగా నాయకత్వంలో దుర్మార్గులందరినీ బుగ్గి చేయడంతో కథ ముగుస్తుంది.
‘ఎర్రమల్లెలు’ చిత్రంలో మురళీమోహన్, గిరిబాబు, మాదాల రంగారావు, రంగనాథ్, పి.ఎల్.నారాయణ, సాక్షి రంగారావు, పి.జె.శర్మ, సాయిచంద్, చలపతిరావు, నర్రా వెంకటేశ్వరరావు, వీరభద్రరావు, వై.విజయ, కృష్ణవేణి, లక్ష్మీచిత్ర నటించారు. తరువాతి రోజుల్లో ‘ప్రతిఘటన’ వంటి సంచలన చిత్రాలు రూపొందించిన దర్శకుడు టి.కృష్ణ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. లాయర్ గా ఓ సన్నివేశంలో పోకూరి బాబూరావు కనిపించారు. మాదాల రంగారావు తనయుడు మాదాల రవి బాలనటునిగా నటించాడు. అతనిపై చిత్రీకరించిన “నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో…” అన్న పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ పాటతో పాటు “నేడే మేడే మేడే…” , “బంగారు మాతల్లీ భూమీ మా లచ్చిమీ..”, “ఏయ్ లగిజిగి లంబాడీ… తిరగబడర అన్నా…” అని సాగే పాటలు కూడా ఆదరణ పొందాయి.
మాదాల రంగారావు కథ అందించిన ఈ చిత్రానికి యమ్.జి. రామారావు మాటలు రాశారు. పాటలు సి.నారాయణరెడ్డి, కొండవీటి వెంకటకవి, అదృష్టదీపక్, ప్రభు, ధవళ సత్యం రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. గౌరవ నిర్మాత అంటూ మాదాల కోదండరామయ్య పేరు ప్రకటించారు. కె.రాధాకృష్ణ నిర్వహణ బాధ్యతలు చూశారు.
మాదాల రంగారావు నిర్మాణసారథ్యంలో అంతకుముందు రూపొందిన ‘యువతరం కదిలింది’లో నటించిన కొందరు ఈ చిత్రంలోనూ కనిపిస్తారు. ‘యువతరం కదిలింది’ కంటే మిన్నగా ‘ఎర్రమల్లెలు’ విజయం సాధించింది. మాదాల రంగారావు చూపిన మార్గంలోనే ఆ తరువాత ఎందరో విప్లవనేపథ్యమున్న చిత్రాలను రూపొందించారు. ఆ చిత్రాలను చూసినప్పుడు సైతం మాదాల రంగారావు మన స్మృతిపథంలో మెదలక మానరు.