I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

I Am Game

I Am Game

I Am Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో నవంబర్ 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళానికే పరిమితం కాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా లెవల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో ‘డాన్ జాన్’ పాత్రలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాతోనే మలయాళంలో నటుడిగా ఎంట్రీ ఇవ్వగా, ఆంటోనీ వర్గీస్ మరో కీలక పాత్రలో కనిపించారు. అయితే స్క్రీన్‌ప్లేలో కాస్త పట్టు తప్పడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. థియేటర్లలో ఫలితం తేడా కొట్టినా, డిజిటల్ రైట్స్ పరంగా మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. మలయాళ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ మొత్తానికి దీని ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. దీంతో ఈ డీల్ మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 6 నుంచి తెలుగుతో పాటు ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తుండటంతో, థియేటర్లలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చూడలేకపోయిన సినిమా లవర్స్ ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు.

ఐయామ్ గేమ్ కథ:

డేన్ జాన్ (దుల్కర్ సల్మాన్) విపరీతమైన గాంబ్లింగ్ వ్యసనం ఉన్న యువకుడు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై దెబ్బలు తింటున్న కొడుకుని చూసి తట్టుకోలేక, తల్లి మెర్సీ (జయసుధ) తన కష్టార్జితం 60 లక్షల రూపాయలను అతడికి ఇస్తుంది. అయితే ఆ డబ్బును కూడా జాన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ఆవేశంలో నిర్వాహకులను బెదిరించి ఆ డబ్బు తీసుకుని కారులో పారిపోతూ ఘోర ప్రమాదానికి గురవుతాడు. ఈ ప్రమాదంలో జాన్ తన కుడి చేతిని కోల్పోవడంతో పాటు కోమాలోకి వెళ్తాడు. ప్రాణాలు దక్కించుకున్న అతడికి వైద్యులు మరొక వ్యక్తి చేతిని అమర్చుతారు. అదే సమయంలో ఫిజియోథెరపిస్ట్ ఇషా (కాయదు లోహర్)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. అప్పటినుంచి అతనికి అమర్చిన కొత్త చేయి జాన్ నియంత్రణ తప్పి తన ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఒక రోజు బెట్టింగ్ సెంటర్లో ఉన్న జాన్ వద్దకు డేవిడ్ (మిస్కిన్) రాగానే, ఆ చేయి కత్తి పట్టుకుని అతనిపై తీవ్రమైన కోపంతో దాడికి దిగుతుంది. ఆ చేయి ఎవరిది? డేవిడ్ ను అది ఎందుకు చంపాలనుకుంది? అనేదే ఈ సినిమా కథ.