OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dorothy

Dorothy

OTT Release: మొదటి ఆటకే బోల్తా పడి, ఆ తర్వాత థియేటర్లలో రచ్చ లేపిన సినిమాలు ఇండస్ట్రీలో చాలా అరుదు. రీసెంట్‌గా తమిళంలో వచ్చిన ‘డోరోతి’ సరిగ్గా ఇలాంటి అద్భుతమే చేసింది. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై మొదటి రోజు అంతా పెదవి విరిచారు. కానీ కథలోని మలుపులు, కీర్తి నటన నెమ్మదిగా జనాలకు ఎక్కడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది.

ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ మొదలయ్యాక థియేటర్ల దగ్గర జనాలు ఎగబడ్డారు. చూస్తుండగానే కలెక్షన్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలా థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం, ఎలాంటి హడావిడి లేకుండా ఉన్నట్టుండి ఓటీటీలోకి దిగిపోయి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ సినిమా నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్సయిన వాళ్లతో పాటు మంచి మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఈ వీకెండ్‌కు ఇది పక్కా ఎంటర్‌టైనర్.

డోరతీ కథ

తమిళనాడులోని ఓ పల్లెటూరి వాతావరణంలో సాగే కథ ఇది. సుబ్బు (సనంత్‌), కార్తీ (రిషికాంత్‌) ప్రాణ స్నేహితులు. సుబ్బు చిన్నతనంలోనే తల్లి, అక్క చనిపోవడంతో ఆ ఇంట్లో స్త్రీల నీడే ఉండదు. పైగా అతని తండ్రి వీరయ్యకు పరువు, కులం, మగతనం అంటే పిచ్చి. ఆడవాళ్ల ఆనవాలు లేని ఆ ఇంట్లో పెరిగిన సుబ్బు, చిన్నప్పటి నుంచి గొడవలకు పోతూ రఫ్‌గా కనిపిస్తున్నప్పటికీ, తనలోని స్త్రీ స్వభావాన్ని సమాజం గుర్తించకుండా జాగ్రత్తపడతాడు. ఓ దశలో సుబ్బు అన్నయ్య డోరతీ (కీర్తి సురేశ్‌) అనే కేరళ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. ఆమె రాకతో ఇంట్లో కొత్త వెలుగు కనిపిస్తుంది. సుబ్బు ఆమెతో ఎంతో సన్నిహితంగా ఉంటాడు కానీ అనూహ్యంగా డోరతీ అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. పరువు పోతుందన్న భయంతో వీరయ్య దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసు ముగించేస్తాడు. అయితే తన తండ్రి, అన్నయ్యే ఆమెను చంపేశారని సుబ్బు భావిస్తాడు. మరోవైపు సుబ్బు కోసం కార్తీ ఓ హత్య చేయాల్సి వస్తుంది. ఒకపక్క కుటుంబ అకృత్యాలు, మరోపక్క తనలో రగులుతున్న స్త్రీ పురుష కాన్ఫ్లిక్ట్ తట్టుకోలేక తాను ట్రాన్స్‌జెండర్‌ అనే విషయాన్ని సుబ్బు బయటపెట్టి ఇల్లు వదిలి పారిపోతాడు. పరువు కోసం కన్న కొడుకుని కూడా చంపాలని చూసే తండ్రి నుంచి సుబ్బు తప్పించుకున్నాడా? అసలు డోరతీ మరణానికి గల కారణమేంటి? ప్రాణ స్నేహితుడు సుబ్బులోని ఈ మార్పును కార్తీ ఎలా స్వీకరించాడు? అనేదే మిగిలిన కథ.