చలో, భీష్మ చిత్రాలతో రెండు బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు యువ దర్శకుడు వెంకి కుడుముల. భీష్మ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంతకుముందు ఈ డైరెక్టర్ రామ్ చరణ్, మహేష్ బాబులతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఈసారి స్టార్ హీరోతో పని చేయాలని భావిస్తున్నాడట వెంకీ. ప్రస్తుతం అతను ఒక హీరోని కనుగొనటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోని స్టార్ హీరోలంతా ఇప్పటికే తాము కమిట్ అయిన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి వెంకీ కుడుములతో పని చేయడానికి ఎవరూ అందుబాటులో లేరనే చెప్పాలి. మరోవైపు కరోనా కారణంగా షూటింగ్ లు సైతం ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో వెంకి కుడుముల తన గురువు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరకే తిరిగి వెళ్లాలని భావిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు త్రివిక్రమ్‌కు సహాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.