‘పేపర్ బాయ్’ వంటి సున్నితమైన ప్రేమకథతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్, తాజాగా ‘అరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మీడియా, సోషల్ మీడియాతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, ఈ వారం విడుదలైన చిత్రాల్లో ‘అరి’ ముందు వరుసలో నిలిచింది. ఈ విజయంతో చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది.
‘అరి’ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్ర దర్శకుడు జయశంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఏడేళ్ల దర్శకుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆయన కొనియాడారు. సినిమా విజయం సాధించినందుకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ నటనతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. సాంకేతికంగా కూడా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవగా, విజువల్స్ కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి.
