NTV Telugu Site icon

Devi Movie : ‘దేవి’లో పాము కాటుకు వ్యక్తి బలి..షాకింగ్ విషయం బయటపెట్టిన డైరెక్టర్

Devi Movie

Devi Movie

గతంలో కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసి తరువాత కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు దేవీ ప్రసాద్. ఇప్పుడు నటుడిగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. తాజాగా తన ఫేస్ బుక్ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించారు ఆయన. ‘కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చి సూపర్‌హిట్టయిన “దేవి” సినిమాలో పాముది ప్రాధాన పాత్ర. షూట్‌లో వాడేపాములన్నీ విషం తీసేసిన పాములే. నాగదేవత భక్తురాలైన “వనిత”పుట్టలో పాలు పోసి పాట పాడితే పాము వచ్చి ఆమెకు బొట్టు పెట్టే సన్నివేశం చిత్రీకరణ జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి షాట్ తీసేటప్పుడు పాముకి మూతి కుట్టేస్తుంటారు. కానీ వనిత ధైర్యంగా “నాకేం భయంలేదు పాముకి నోరు కుట్టొద్దు” అనటంతో కుట్టలేదు. ఫ్రేం ఔట్‌లో వుండి పడగవిప్పివున్న పాముని పట్టుకున్న పాములతను ఓ భాయ్. క్లోజ్‌షాట్‌లో నమస్కారం పెడుతున్న వనిత నుదుటికి పాముని ఆనించాలి. అక్కడివరకూ వచ్చిన పాము ఛక్‌మని ఆమె వ్రేలుని గట్టిగా పట్టేసుకోవటంతో అందరూ షాక్. ఒక నిమిషం తరువాత అది వొదిలేసినా రక్తం ధారగా కారిపోవటంతో కంగారుగా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు. పాముకి విషం లేనందున, అమ్మాయి ధైర్యంగా ఉన్నందువల్లా ఏమీ కాలేదని ఇంజక్షన్స్ ఏవో చేసి పంపించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాం.

Mangli: అంతా విష ప్రచారం.. ‘బాబు’ని నేనేం అనలేదు.. ప్రమాణం చేసి చెబుతున్నా!

మద్రాస్ లో తరతరాలుగా షూటింగ్స్‌కి కావలసిన పాములను తీసుకొచ్చేది సదరు “భాయ్” కుటుంబమే. అతనితో పాటు అతని అసిస్టెంట్‌గా ఓ 19 ఏళ్ళ బక్కపలుచని కుర్రాడొచ్చేవాడు”దేవి”షూటింగ్‌కి. ఎంతో హుషారుగా వుంటూ యూనిట్ అందరికీ ఇష్టుడైపోయాడు. వాడి అసలుపేరేంటో గానీ డైరెక్టర్‌ “మణి” అనిపిలుస్తూ వాడిమీద జోకులేస్తూవుండేవారు. ఈ క్రమంలో ఓ షెడ్యూల్ వైజాగ్‌లో ప్లాన్ చేశాం. “భాయ్” కి మరో షూటింగ్ ఉండటంతో ఆ షెడ్యూల్‌కి భాయ్ లేకుండా “మణి”మాత్రమే పాములు తీసుకొచ్చాడు. చిన్నకుర్రాడివి నువ్వేంచెయ్యగలవురా అంటే మీకెలా షాట్ కావాలో చెప్పండి సార్ అదరగొడతా అన్నట్లుగా మాట్లాడాడు. ఓ రాత్రి 8 గంటలకు మేడ మీది గదిలో భానుచందర్‌, వనిత పడుకునివుంటే పాము బెడ్‌పైకెక్కి విలన్ పంపిన విషవాయువుని పీల్చేసే సీన్ తీస్తున్నాం. బుట్టలోనుండి తీసిన రెండుమూడు పాములతో ఆ షాట్ తీయడానికి ప్రయత్నించినా లైట్స్ వేడికి ఒక్క పామూ నిలబడలేక వాలిపోతుంది. పౌరుషం వచ్చిన “మణి” గుడ్డసంచిలోవున్న మరోపాముని బయటికి తీశాడు. బుస్సున పడగవిప్పింది. అదెంతకోపంగా వుందంటే వాడిచేతిమీద నాలుగైదుసార్లు పడగతోకొట్టింది. చేతి మీద రక్తపు బొట్లు కనిపించటంతో అందరూ ఖంగారుపడుతుంటే “ఇవన్నీ మాకు మామూలే సార్.వనిత గారి ఇన్సిడెంట్ చూశారు కదా ఎందుకు భయపడతారు” అంటూ బెడ్ మీద పెట్టాడు పాముని. షాట్ అయిపోయాక బుట్టలుతీసుకుని కిందికి వెళ్ళిపోయాడు మణి.

కొంతసేపయ్యాక ఏదోపనిమీద నేను క్రింది ఫ్లోర్‌కి వెళితే “మణి” వాంతి చేసుకోవటానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. చెయ్యిచూస్తే వాచివుంది. వాడు నవ్వుతూనే ఉన్నా నా మనసు ఏదో కీడు శంకించింది. వాడు వొద్దంటున్నా బలవంతంగా మేనేజర్ మురళితో హాస్పిటల్‌కి పంపించాము. రాత్రి 11గంటలకు హోటల్ రూంలో భోజనానికి కూర్చుంటుంటే బెల్ మ్రోగింది. డోర్ ఓపెన్ చేయగానే మేనేజర్ మురళి గారు “మణి”గాడు చనిపోయాడు సార్ అంటూ ఏడుస్తున్నాడు. కాళ్ళకింద భూమి కదిలిపోయింది. మద్రాసు “భాయ్” కి ఫోన్ చేసి చెబితే అతను భోరుమంటూ…అది కొత్త పాము సర్. కొత్తగా పట్టి విషం తీసిన పాముని 4 నెలలు గుడ్డ సంచిలో పెట్టి ఆ తరువాతే షూటింగ్స్‌లో వాడుతాము అప్పుడే దానిలో విషం పూర్తిగా పోతుంది. మణికి ఆ విషయం తెలియక ఆ పాముని తెచ్చాడు అన్నాడు. దానికంటే మాకు విస్మయం కలిగించిన అంశం “మణి”ఐదేళ్ళక్రితం భోజనం లేక ఏ.వీ.యం.స్టూడియో పరిసరాల్లో తిరుగుతుంటే జాలి పడి చేర దీశాం. వాడి ఊరేదో తల్లితండ్రులెవరో కూడా మాకు తెలియదు. వాడి సామానంతా వెతికినా ఒక్క క్లూ అయినా దొరకలేదు” అని చెప్పాడు భాయ్. ఏ తల్లి కన్నబిడ్డో…. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వైజాగ్ మట్టిలో కలిసిపోయాడు మణి’ అంటూ అప్పటి సంగతి చెప్పుకొచ్చారు దేవీ ప్రసాద్.