Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!

Dil Raju Anil Ravipudi Movie

Dil Raju Anil Ravipudi Movie

Dil Raju – Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండగంటేనే అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. పండగ సీజన్‌లో తన బ్యానర్ నుంచి భారీ సినిమాను దించి హిట్ కొట్టడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణ’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న దిల్ రాజు, తన తదుపరి సినిమాల ప్లానింగ్‌పై ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఏకంగా 2028 సంక్రాంతి రేసుపై ఇప్పుడే కర్చీఫ్ వేసేస్తూ, తన ఫేవరెట్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాబోతున్నట్లు కుండబద్దలు కొట్టారు.

మీడియా సమావేశంలో ఓ విలేకరి.. అనిల్ రావిపూడితో మీ బ్యానర్‌లో నెక్స్ట్ సినిమా ఉండబోతోందని, అది 2028 సంక్రాంతికి రానుందనే ప్రచారం నిజమేనా అని ప్రశ్నించారు. దీనిపై దిల్ రాజు ఏమాత్రం దాపరికం లేకుండా క్లారిటీ ఇచ్చారు. “అవును, అనిల్ రావిపూడితో మా సంస్థలో కచ్చితంగా ఒక సినిమా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ 2027లో ప్రారంభమవుతుంది, 2028 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ క్రేజీ కాంబినేషన్‌లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోతున్నారంటూ ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోందని, హీరో ఎవరో చెప్పాలని మీడియా ప్రతినిధులు అడిగారు. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ.. “అనిల్ రావిపూడి స్టైల్ మీకు తెలిసిందే కదా! ఆయన ముందుగా కథ అనుకున్న తర్వాతే ఆ పాత్రకు ఏ హీరో సెట్ అవుతారో ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతం అనిల్ చేస్తున్న సినిమా 2027 జనవరి 12న సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక ఐడియా చెప్తారు. ఇప్పటికే ఆయన ఆ కథను షేప్ చేసే పనిలో ఉన్నారు. ఆ ఐడియా విన్న తర్వాతే ఏ హీరో దగ్గరికి వెళ్లాలనేది నిర్ణయిస్తాం” అని వివరించారు.

ఇక బాలకృష్ణ హీరోగా ఉంటారన్న రూమర్లపై స్పందిస్తూ.. “బయట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది కానీ, ఏది ఫైనల్ అవుతుందో నాకు కూడా ఇంకా తెలియదు. తెలియని విషయాన్ని నేను ఇప్పుడే చెప్పలేను కదా ప్రస్తుతానికి డైరెక్టర్, నేను దానిపై ఇంకా కూర్చోలేదు. పైగా అనిల్ ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు నేను అస్సలు ప్రెషర్ పెట్టను. ఎందుకంటే ముందుగా ఆయన తీస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలి, ఆ తర్వాతే మన సినిమా” అంటూ దిల్ రాజు తేల్చి చెప్పారు. మొత్తానికి హీరో ఎవరనేది సస్పెన్స్‌గా ఉంచినా, 2028 సంక్రాంతి బరిలో దిల్ రాజు – అనిల్ రావిపూడి కాంబో దిగడం ఖాయమని తేలిపోవడంతో అభిమానుల్లో ఇప్పుడే అంచనాలు మొదలయ్యాయి.