Site icon NTV Telugu

Dhurandhar Collections: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు.. ‘జవాన్’ రికార్డు బద్దలు!

Dhurandhar Collections

Dhurandhar Collections

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజా సినిమా ‘ధురంధర్’ బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఊహించని విజయాన్ని అందుకున్న ధురంధర్.. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. కేవలం మూడు వారాల్లోనే రూ.600 కోట్ల మార్కును దాటి.. రూ.700 కోట్ల క్లబ్‌ దిశగా దూసుకెళుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ రికార్డును బ్రేక్ చేసింది.

ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ నివేదిక ప్రకారం.. 22వ రోజు (డిసెంబర్ 26) ధురంధర్ సినిమా రూ.15 కోట్లు వసూలు చేసింది. మూడవ వారం కూడా మంచి వసూళ్లతో ఆకట్టుకుంది. రూ.173 కోట్లు వసూలు చేసింది. మొదటి వారంలో రూ.207.25 కోట్లు, రెండవ వారంలో రూ.253.25 కోట్లు వసూలు చేసింది. ధురంధర్ సినిమా మొత్తంగా రూ.648.50 కోట్లు (సుమారు $6.48 బిలియన్లు) వసూళ్లు సాధించింది. ఇక ధురంధర్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. గతంలో బాహుబలి 2, దంగల్, పఠాన్, జవాన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్కును దాటాయి.

భారతదేశ వసూళ్ల పరంగా 2023లో వచ్చిన జవాన్ సినిమా (రూ.640 కోట్లు)ను ధురంధర్ అధిగమించింది. స్త్రీ 2 (రూ.598 కోట్లు), చావా (రూ.601 కోట్లు) రికార్డులను కూడా బద్దలు కొట్టింది. డైరెక్టర్ ఆదిత్య ధార్ సహా హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కెరీర్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ధురంధర్ నిలిచింది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడిలు నటించారు. సీక్వెల్ (ధురంధర్ 2) 2026న ఈద్ సందర్భంగా మార్చి 19న రిలీజ్ కానుంది. హిందీ సహా అన్ని దక్షిణ భాషలలో ధురంధర్ 2 విడుదల కానుంది.

Exit mobile version