కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే ‘బుక్ మై షో’లో గంటకు పది వేలు, ఇరవై వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు ట్రెండింగ్ కనిపిస్తుంది. ఆ హైప్ చూసి సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా సూపర్ హిట్ అనుకుని థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. కానీ, ఆ బుక్ మై షో ట్రెండింగ్ వెనుక ఎంత పెద్ద ‘స్కామ్’ నడుస్తుందో ‘సమ్మర్ హాలిడేస్’ నిర్మాత ధీరజ్ మొగిలినేని సంచలన రీతిలో బయటపెట్టారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న నిజాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బుక్ మై షోలో సినిమాలను ట్రెండింగ్ చేయడం వెనుక పక్కా మానిప్యులేషన్ ఉంటుందని ధీరజ్ కుండబద్దలు కొట్టారు. ఏదైనా ఏరియాలో ఎప్పుడో మూతపడిపోయిన ఒక పాత థియేటర్‌ను తీసుకుని, అందులో అసలు సినిమా ఆడకపోయినా, థియేటర్ క్లోజ్ అయి ఉన్నా ఆన్లైన్లో మాత్రం షోలు ఓపెన్ చేస్తారని ఆయన బాంబు పేల్చారు.
ఈ మానిప్యులేషన్ ఎలా జరుగుతుందో ఆయన వివరిస్తూ.. “సాధారణంగా ఒక థియేటర్లో రోజుకు 4 షోలు వేస్తారు. కానీ వీళ్లు మాత్రం ఏకంగా పది షోలు వేసేస్తారు. ఉదయం 5 గంటలకు, 6 గంటలకు.. ఇలా ట్రెండింగ్ రావడానికి ఏ టైమ్ కావాలంటే ఆ టైమ్‌లో ఐదారు షోలు క్రియేట్ చేస్తారు. ఇక టికెట్ రేటు రూ.150 కాకుండా, కేవలం 10 రూపాయలో లేక 50 రూపాయలో పెడతారు. ఆ థియేటర్ పేరు చూడగానే అది చెత్త థియేటర్ అని సాధారణ ప్రేక్షకులు దాన్ని ఓపెన్ కూడా చేయరు. ఇదే అదనుగా, పలు ఫేక్ అకౌంట్ల నుంచి ఆ రూ.50, రూ.10 టికెట్లను బల్క్‌గా కొనేస్తారు” అని ధీరజ్ అసలు గుట్టు విప్పారు. ఇలా అతి తక్కువ రేటుతో వేలాది టికెట్లను ఫేక్ అకౌంట్ల ద్వారా కొనడం వల్ల, ఆటోమేటిక్‌గా బుక్ మై షోలో ‘గంటకు ఇన్ని వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి’ అని కౌంట్ చూపిస్తుందని, దీంతో ఆ సినిమా ట్రెండింగ్‌లోకి వస్తుందని ఆయన లాజిక్ వివరించారు. “సినిమా ఇండస్ట్రీలో మీరు ఏది అడిగినా దాని వెనకాల ఒక స్కామ్ ఉంటుంది.. డబ్బులుంటే ఇక్కడ ఏదైనా చేస్తారు, ప్రస్తుతం ఇదే నడుస్తోంది” అంటూ ధీరజ్ మొగిలినేని చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు.. ఫేక్ కలెక్షన్స్, ఫేక్ హైప్ సృష్టించే బడా మేకర్స్ బండారాన్ని బట్టబయలు చేశాయి.

