Site icon NTV Telugu

The Girlfriend : రష్మికతో పని చేయడం ఓ అందమైన అనుభవం: హీరో దీక్షిత్‌ శెట్టి

Rashmika Dikshith The Girlfriend

Rashmika Dikshith The Girlfriend

‘ప్రేమను మరో కోణంలో చూపించే చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అంటూ హీరో దీక్షిత్‌ శెట్టి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన దీక్షిత్‌ తన అనుభవాలను పంచుకున్నారు. “సాధారణంగా మనం వినోదం కోసం సినిమాలు చూస్తాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్‌ మాత్రం థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మన మనసులో మిగిలిపోతుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అలాంటి సినిమా. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు మన జీవితాల్లోని అనుభవాల్లా అనిపిస్తాయి. రష్మిక ఈ సినిమాపై ఎంతో ప్యాషన్‌తో పనిచేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట నాకు చాలా నచ్చింది ‘కొన్నేళ్ల క్రితం ఇలాంటి సినిమా చూసుంటే నా జీవితంపై దృష్టికోణం మరోలా ఉండేదేమో’ అని. ఆ మాటే ఈ కథ ఎంత లోతైనదో చెబుతోంది” అని అన్నారు.

Also Read : Vijay Devarakonda : ‘రౌడీ జనార్దన’లో సీనియర్ హీరోయిన్ ఎంట్రీ?

అలాగే తన పాత్ర గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను విక్రమ్‌ అనే టాక్సిక్‌ బాయ్‌ఫ్రెండ్‌ పాత్రలో కనిపిస్తాను. చాలా రియలిస్టిక్‌గా, ప్రతి యువకుడి జీవితంలో ఏదో ఒక దశలో కనిపించే స్వభావాన్ని ప్రతిబింబించే పాత్ర ఇది. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ గారు నన్ను ఈ రోల్‌ కోసం ఎంచుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ‘దసరా’ సినిమా ఇంటర్వ్యూల్లో నన్ను చూసి ఈ కథకు సరిపోతానని ఆయన అనుకున్నారని చెప్పారు. ఆ నమ్మకానీ నెరవేర్చానని అనిపిస్తుంది”. రష్మికతో పని చేసిన అనుభవం గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.. “రష్మికతో పనిచేయడం నిజంగా ఓ అందమైన అనుభవం. ఆమె స్టార్‌ అయినా, సెట్లో అందరితో చాలా ఫ్రెండ్లిగా, సింపుల్‌గా ఉంటుంది. ‘యానిమల్‌’ సినిమా పెద్ద హిట్‌ అయిన టైమ్‌లో మేము ఈ సినిమా చేస్తున్నాం. అయినా ఆమె ఎక్కడా ఆ స్టార్‌ ఫీలింగ్‌ రానివ్వలేదు. తెరపై ఆమె నటన చూసినప్పుడు రష్మిక కంటే భూమ అనే పాత్రే కనిపిస్తుంది. ఆమె ఆ పాత్రలో పూర్తిగా మునిగిపోయింది” అని అన్నారు. అంతేకాదు “నా నటన చూసి అల్లు అరవింద్‌ గారు ప్రత్యేకంగా ప్రశంసించి, మరో సినిమాకి అడ్వాన్స్‌ ఇచ్చారు. అది నాకు పెద్ద గౌరవం. భవిష్యత్తులో కూడా అలాగే విభిన్నమైన కథల్లో, వైవిధ్యభరితమైన పాత్రలో నటించాలని కోరుకుంటున్నా,” అని దీక్షిత్‌ చెప్పుకొచ్చారు. ప్రజంట్ దీక్షిత్ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version