ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ‘జగమే తంత్రం’ మూవీ మొత్తానికీ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నిజానికి వేసవి కానుకగా థియేట్రికల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ లోగా వైనాట్ స్టూడియోస్ కు థియేటర్ల యాజమాన్యంకు మధ్య ఏర్పడిన చిన్నపాటి అగాథంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ లోగా కరోనా సెకండ్ వేవ్ సైతం బలపడటంతో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ వైపు నిర్మాతలు మొగ్గు చూపారు. జేమ్స్ కాస్మో, కలైయరసన్, జోజె జార్జీ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ లభించింది. 2గంటల 37 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల మూవీలోని మూడో పాటను విడుదల చేశారు. ‘నేతూ… ‘ అనే ఈ రొమాంటిక్ నంబర్ విడుదలై కాగానే విశేష ఆదరణ పొందింది. విశేషం ఏమంటే… దీనిని ధనుష్ స్వయంగా రాసి, పాడాడు. ప్రస్తుతం ఈ పాట కోట్లాది మంది శ్రోతల హృదయాలను కొల్లగొట్టే పనిలో ఉంది.