Nani: ‘నాని’ బ్రాండ్ ఉంటేనే చిన్న సినిమాలకు ఆదరణ?

Nani

Nani

Hero Nani: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలను థియేటర్లలోకి తీసుకెళ్లి, ప్రేక్షకులను రప్పించడం అంత ఈజీ కాదు. కంటెంట్ ఎంత బాగున్నా కూడా, కొత్తవాళ్లు నటించిన సినిమాలకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావడం కష్టమవుతోంది. కానీ చిన్న సినిమాలకు హీరో నాని బ్రాండ్ తోడైతే ఆ మూవీ రేంజ్ ఒక్కసారిగా మారిపోతుందని నిర్మాత దీప్తి గంటా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఇటీవల ‘కోర్ట్’ సినిమా సాధించిన ఘనవిజయం తర్వాత నాని సమర్పణలో వచ్చే చిత్రాలపై ప్రేక్షకుల్లో నమ్మకం, అంచనాలు భారీగా పెరిగాయని ఆమె పేర్కొన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. హీరో నాని సపోర్ట్ వల్ల చిన్న సినిమాలకు కలిగే ప్రయోజనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇది నిజమే.. మంచి కథలను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లడానికి నాని బ్రాండ్ వాల్యూ కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆయన ఒక సినిమాను సమర్పిస్తూ, స్వయంగా ప్రమోట్ చేస్తున్నారంటే అందులో కచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉందని జనం బలంగా నమ్ముతారు. వాల్ పోస్టర్ సినిమా లక్ష్యం కూడా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ముందుగా మంచి కథలను గెలిపించడమే” అని ఆమె స్పష్టం చేశారు.

అంతేకాకుండా, నిర్మాతగా నాని పనితీరు గురించి దీప్తి మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని ఒక్క రోజు కూడా సెట్స్‌కు వచ్చి ఫుటేజ్ చూడలేదని, పూర్తిగా దర్శకుడి విజన్‌ను నమ్మి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా, కథపై నమ్మకంతో దర్శకుడికి ఇంతటి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నాని బ్యానర్ నుంచి వైవిధ్యమైన, నాణ్యమైన సినిమాలు వస్తున్నాయని సినీ వర్గాలు సైతం ప్రశంసిస్తున్నాయి. ఇక నాని నిర్మాతగా ‘అలియాస్ రుక్మిణి’ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే హీరోగా కూడా భారీ ప్రాజెక్టులను చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.