ఐఐటీలో ర్యాంకు.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్.. ఆదిభట్లలోని టాటా ఏరోస్పేస్‌లో ఉద్యోగం.. ఒకరకంగా చెప్పాలంటే దశరథ మాధవ్‌కు అద్భుతమైన కెరీర్ ఉంది. కానీ ఆయన మనసు మాత్రం సినిమాలపైనే ఉండేది. వెండితెరపై నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలన్న కల కోసం మంచి జీవితాన్ని పక్కన పెట్టారు. ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆందోళన కంటే.. తన కలను నిజం చేసుకోవాలన్న పట్టుదలతో ముందడుగు వేశారు. తన ఆశయం కోసం ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రయత్నించారు. ఇప్పుడు ‘కిల్లర్’ సినిమాతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దశరథ మాధవ్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. ఏడో తరగతి చదువుతున్న సమయంలో తమ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వచ్చారు. ఆ సమయంలో దశరథ తనకు సినిమాలపై ఉన్న ఆసక్తిని ఆయనతో పంచుకున్నారు. అయితే ముందుగా చదువు పూర్తి చేసి, ఆ తర్వాత సినీరంగంలోకి రావాలని అయన సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాలు ఉంటేనే సినీరంగంలో మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్న ఆయన సలహా దశరథ మనసులో బలంగా నాటుకుపోయింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇచ్చిన సలహాను స్ఫూర్తిగా తీసుకున్న దశరథ చదువుపై దృష్టి పెట్టారు. పదో తరగతిలో డిస్టింక్షన్ సాధించడంతో పాటు ఇంటర్‌లోనూ మంచి మార్కులు తెచ్చుకున్నారు. అనంతరం ఐఐటీలో ర్యాంకు సాధించి.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత మాస్టర్స్ చేసి.. ఆదిభట్లలోని టాటా ఏరోస్పేస్‌లో ఉద్యోగం సంపాదించారు.
అయితే ఉద్యోగం చేస్తున్నప్పటికీ దశరథ మాధవ్‌లోని సినీ కల మాత్రం సజీవంగానే ఉంది. రోజూ క్యాబ్‌లో ప్రయాణించే సమయంలో రేడియో మిర్చి వినేవారు. అలా రేడియో మిర్చి, ఈటీవీ సంయుక్తంగా నిర్వహించిన ‘వాయిస్ ప్యాషన్’ షో గురించి తెలుసుకున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకుని తన ప్రతిభను పరీక్షించుకున్నారు. షోలో దాదాపు 50 వేల మంది పాల్గొనగా.. వారిలో 15 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ పోటీలో మాధవ్ మొదటి స్థానంలో నిలిచి టైటిల్ విజేతగా నిలిచారు. ఈ అనుభవం ఆయనకు వినోద రంగంలో మరిన్ని అవకాశాలకు మార్గం చూపించింది. ఆ తర్వాత యాంకర్ సుమ నిర్వహించిన ‘ఈ జంక్షన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామెడీ స్కిట్లకు రచయితగా పనిచేయడంతో పాటు వాటిలో నటించారు. అలా రచన, ప్రదర్శన, నటనలో తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సినిమా రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. మాధవ్ ఇప్పుడు ‘కిల్లర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

