‘కలర్ ఫొటో’, బ్లాక్‌బస్టర్ ‘బెదురులంక 2012’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఆలోచన, అమెరికా నుంచి సినిమా ప్రయాణం
“నాది మెదక్. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. ఆ రొటీన్ లైఫ్ బోర్ కొట్టింది. నా మెదడులో చాలా కథలు ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేది. ప్రేమ కథలు చెప్పడం కష్టమని భావించి, బలమైన కాన్సెప్ట్, సమాజ మూలాల నుంచి వచ్చే కథను ఎంచుకున్నాను” అని మురళీకాంత్ వివరించారు. పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో రకాల జీవనశైలులు తెలిశాయని, సమాజంలోని అసమానతలపై కథ చెప్పాలనే ఉద్దేశంతోనే ‘దండోరా’ కథను రాసుకున్నానని ఆయన తెలిపారు.
రీసెర్చ్: అంతుచిక్కని వివక్ష
‘దండోరా’ కథకు బీజం పడిన విధానం గురించి చెబుతూ, చనిపోయిన వ్యక్తులను పూడ్చే విషయంలో కమ్యూనిటీలు, మతాల వారీగా భూమి కేటాయింపు ఉంటుందనే విషయం తనకు అంతగా తెలియదని, ఒక వ్యక్తిగత అనుభవం నుంచే ఈ కథ పుట్టిందని అన్నారు. “మలయాళంలో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తుంటాయి. మన దగ్గర ఎందుకు రావట్లేదు?” అనే ఆలోచన నుంచి ఈ కథను రూపొందించినట్టు తెలిపారు. ‘దండోరా’లో కూడా మరణం తర్వాత జరిగే కథే ఉన్నప్పటికీ, ‘బలగం’ చిత్రానికి దీనికి ఎలాంటి పోలికలు, స్ఫూర్తి లేవని ఆయన స్పష్టం చేశారు. “బలగం పిండ ప్రధానం చుట్టూ తిరిగితే, ‘దండోరా’లో వ్యక్తి చనిపోయిన దగ్గర నుంచి పూడ్చిపెట్టే వరకు జరిగే సంఘటనలను చూపిస్తుంది. క్రిమేషన్‌తో ఈ సినిమా ముగుస్తుంది. ఓ వ్యక్తిని ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ సమస్య ఏంటి? పరిష్కారం దొరికిందా? అన్నదే ప్రధాన కథాంశం.” అని దర్శకుడు తెలిపారు.
స్త్రీ పాత్రలే కీలకం
‘దండోరా’లో ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, ప్రతి పాత్ర శివాజీ గారి క్యారెక్టర్‌కు లింక్ అయి ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ముఖ్యంగా, బిందు మాధవి పాత్ర ప్రేక్షకులకు సర్ ప్రైజింగ్‌గా, చాలా బలమైన మహిళా పాత్రగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే కీలక నిర్ణయాలన్నీ మహిళా పాత్రలే తీసుకుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు వైకుంఠ ధామాల్ని ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ కూడా వివక్షనే చూపిస్తున్న ఎన్నో ఘటనల్ని తాను ప్రత్యక్షంగా చూశానని, అందుకే ఆ పాయింట్‌ను టచ్ చేస్తూ ఈ కథను రాశానని మురళీకాంత్ తెలిపారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ సహకారం
“చాలా మంది నిర్మాతలకు కథ పంపాను. కానీ రవీంద్ర గారికి కథ పంపగానే ఆయనకు వెంటనే నచ్చింది. తక్కువ బడ్జెట్‌లో చేద్దామని నేను చెప్పినా, మంచి క్వాలిటీతో, భారీ ఎత్తున తీయాల్సిందే అని ఆయనే ముందుండి నడిపించారు. మా ఇద్దరి మధ్య ఎన్నో క్రియేటివ్ డిస్కషన్స్ వచ్చాయి. సినిమా చూసిన తర్వాత రవీంద్ర గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు” అని దర్శకుడు రవీంద్ర బెనర్జీ ముప్పానేని సహకారాన్ని కొనియాడారు. ‘దండోరా’ టైటిల్ గురించి మాట్లాడుతూ, మొదట ‘అంతిమ యాత్ర’ అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకున్నారని, అది డల్‌గా ఉందని నిర్మాతే భావించారని, పవర్ ఫుల్ సౌండింగ్‌తో టైటిల్ ఉండాలని భావించి, ఒక స్నేహితుడి సలహా మేరకు ‘దండోరా’ను ఖరారు చేశామని మురళీకాంత్ వివరించారు.
అద్భుతమైన అనుభూతితో బయటకు వస్తారు
‘దండోరా’ నుంచి ప్రేక్షకులు ఏం ఆశించాలి? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో పది అంశాలపై ఊహాగానాలు వచ్చి ఉంటాయి. కానీ సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ సర్ ప్రైజ్ అవుతారు. మార్క్ కె రాబిన్ గారి మ్యూజిక్, ముఖ్యంగా రీ-రికార్డింగ్ అందరినీ కదిలిస్తుంది. ‘దండోరా’ చిత్రం, అందులోని స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఓ అందమైన అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు” అని దర్శకుడు మురళీకాంత్ ప్రేక్షకులకి హామీ ఇచ్చారు.