Comedian Ramachandra Gets Financial Aid from Hero Sanjosh: బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న టాలీవుడ్ కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ అండగా నిలిచారు. తాజాగా రామచంద్రను పరామర్శించిన సంజోష్.. ఆయన వైద్య ఖర్చుల తన వంతు ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో ఉన్న తోటి సినీ కళాకారుడికి సాయం చేసిన సంజోష్.. తన మంచి మనసును చాటుకున్నారు. సంజోష్ ఇంతకుముందు కూడా చాలా మందికి తన వంతు ఆర్థిక సాయం అందించారు.
కమెడియన్ రామచంద్ర చికిత్స కోసం ఇంకా సుమారు రూ.8 లక్షలు అవసరమని తెలుసుకున్న హీరో సంజోష్.. ఆయనకు మరింత సహాయం అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని రామచంద్ర కోరారు. దీనిపై స్పందించిన సంజోష్.. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అన్నకు చేరవేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రామచంద్రకు మరింత సహాయం అందించేందుకు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ముందుకు రావాలని ఆయన కోరారు. సినిమా కుటుంబం ఒక్కటై రామచంద్రకు అండగా నిలిస్తే చికిత్సకు అవసరమైన సాయం అందుతుందన్నారు.
వెంకీ సినిమాలో ‘బుజ్జి’ పాత్రతో రామచంద్రకు మంచి గుర్తింపు వచ్చింది. వెంకీ, దుబాయ్ శీను, సొంతం, దరువు వంటి పలు హిట్ సినిమాల్లో హాస్య పాత్రల్లో నటించారు. రామచంద్రకు ఇంకా పెళ్లి కాలేదు. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికే కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన తమ్ముడు దగ్గర ఉంటున్నారు. రామచంద్ర త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

