“మా సినిమా అంత వసూలు చేసింది” అని కొందరంటే, “కాదు మీ దానికంటే ఎక్కువగా మా మూవీ కలెక్ట్ చేసింది…” అంటూ మరికొందరు అంటూ ఉంటారు. ఇది తెలుగునాట టాప్ స్టార్స్ సినిమాలు విడుదలయిన సమయంలో తరచూ వినిపించే మాటలే! ఇలా వసూళ్ళ విషయాలను గురించి, తమ సినిమాల రన్నింగ్ గురించి చర్చించుకుంటూ మురిపిసోయే వారిని సినిమా పిచ్చోళ్ళు అంటూ గేలి చేసేవారూ ఉంటారు. అమెరికాలో పనిచేస్తూ, స్వదేశం తిరిగి వచ్చిన వారు “ఇంకా ఆ పిచ్చిలోనే ఉన్నారా?… అందుకే మన దేశం ఇలా తగలడింది…” అంటూ రాగాలు తీసేవారూ లేకపోలేదు. అసలు అమెరికాలో ఇలాంటివన్నీ ఎవరూ పట్టించుకోరని, అక్కడ అందరూ తమ పనులు గురించి, భవిష్యత్ గురించే ఆలోచిస్తుంటారనీ కథలు భలేగా వినిపిస్తూ ఉంటారు. కానీ, అక్కడ కూడా ఉండేది మనుషులేనని, వారికీ కొన్ని అభిరుచులు ఉంటాయనీ, వారిలోనూ సినిమా పిచ్చోళ్ళు లేకపోలేదని ఎవరూ చెప్పరు. నిజానికి ఇలా వసూళ్ళ గురించి, సినిమా రన్నింగ్ గురించి ప్రపంచానికి తొలుత చాటింది హాలీవుడ్ జనమే!
ఇప్పటికీ హాలీవుడ్ జనం తమ సినిమాల గురించి, వాటి వసూళ్ళ గురించి సోషల్ మీడియాలో టముకు వేసుకుంటూనే ఉన్నారు. అమెరికాలో తెలుగువాళ్ళలాగా సినిమా పిచ్చోళ్ళు ఉండరంటూ ఎవరైనా మనవాళ్ళు చెబితే అసలు నమ్మకండి! అక్కడ కూడా యువత ఏ సినిమా ఏ మేరకు వసూలు చేసింది. ఆ సినిమాపై ఎంత ఆదాయం వచ్చింది అంటూ లెక్కలు తీస్తూనే ఉంటారు. పైగా, అది తమ ఉద్యోగంలో భాగంగానే చేసేవారూ ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే జేమ్స్ కేమరాన్ ‘అవతార్-2’ విడుదలై ఇప్పటికి 67 రోజులు దాటింది. ఈ సినిమా ఇంకా అనేక దేశాలలో వందలాది కేంద్రాలలో రన్ అవుతూనే ఉంది. ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ విడుదలైనప్పుడు చాలామంది పెదవి విరిచారు. ‘అవతార్-1’ స్థాయిలో ఈ సినిమా లేదనీ అన్నారు. ఆరంభంలో మందకొడిగా సాగిన వసూళ్ళ పర్వం జనవరిలో బాగా ఊపందుకుంది. అనూహ్యంగా ‘అవతార్-2’ కూడా వసూళ్ళ వర్షం కురిపించ సాగింది. అయితే ఓపెనింగ్స్ లో దెబ్బ పడడం వల్ల ఈ చిత్రం ఇంతగా కోలుకున్నా, ‘అవతార్-1’ను చేరుకోలేక పోతోంది.
ఈ 67 రోజుల్లో ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ రెండు బిలియన్ల 244 మిలియన్లు పోగేసి, టాప్ గ్రాసర్స్ లో మూడో స్థానం చేరుకుంది. ఓపెనింగ్స్ లో తేడా పడకుంటే ఈ సినిమా ఈ పాటికే రెండో స్థానంలో ఉండేదని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. మరి ఈ సినిమాకు ఓపెనింగ్స్ లో గండి పడటానికి కారణం ఏంటి? సినిమా నిడివి ఎక్కువగా ఉండడం వల్ల బోర్ ఫీలయిన నవతరం ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ తీసుకు వచ్చింది. అయితే అదే జనం, ఆ తరువాత మొదటి భాగాన్ని పలు మాధ్యమాల్లో చూసి, మళ్ళీ ‘అవతార్-2’ను థియేటర్లలో చూడటానికి పరుగులు తీసింది. దాంతో కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో మెల్లగా ‘అవతార్-2’ మూడో స్థానం చేరుకుంది. ఖచ్చితంగా ఈ సినిమా రెండో స్థానంలో ఉన్న ‘అవేంజర్స్: ది ఎండ్ గేమ్’ను దాటేస్తుందని ఇప్పుడు అమెరికాలో యువత భలేగా పందేలు వేసుకుంటోంది. మరి వారిని చూసి మన జనం ఏమంటారో?
