IFFI 2026: ప్రతిష్టాత్మక 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2026) వేదికపై తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది. గోవాలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ పనోరమా మెయిన్‌స్ట్రీమ్ విభాగంలో దేశవ్యాప్తంగా ఎంపికైన కేవలం ఐదు చిత్రాల్లో ఒకటిగా నిలిచి ఈ సినిమా అరుదైన రికార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా గోవాలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, కె.సుస్మిత, హీరోయిన్ కేథరిన్ థ్రెసా పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ ప్రెస్ మీట్లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రేక్షకులను నవ్వించడం అనేది చాలా సీరియస్ పని అని, అదంత సులభం కాదని చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి లాంటి సూపర్ స్టార్‌పై అభిమానులకు ఉండే భారీ అంచనాలను అందుకుంటూ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ కామెడీ రాయడం తనకు పెద్ద సవాల్‌గా అనిపించిందన్నారు. థియేటర్లో ఏ జోక్ పేలుతుందో ముందే అంచనా వేయడం కష్టమని, ఈ విషయంలో తన రైటర్స్ టీమ్ ఎంతో హెల్ప్ చేసిందని గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరగడం వల్లే, ఆయనలోని కామెడీ టైమింగ్, నటనలోని వైవిధ్యాన్ని ఈ కథలో పర్ఫెక్ట్గా చూపించగలిగానని అనిల్ తెలిపారు.
ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ.. చిరంజీవి లాంటి సీనియర్ స్టార్‌తో కలిసి నటించడం తనకు దక్కిన గొప్ప అవకాశమని, ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పుడూ సీరియస్ పాత్రలే కాకుండా ఇలాంటి ఫన్ రోల్ చేయడం కొత్తగా అనిపించిందన్నారు. మరోవైపు, కేవలం ఆర్ట్ సినిమాలకే కాకుండా కోట్లాది మందిని థియేటర్లకు రప్పించే కమర్షియల్ సినిమాలకు కూడా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గుర్తింపు ఇస్తున్న జ్యూరీ సభ్యులకు అనిల్ రావిపూడి ధన్యవాదాలు తెలిపారు. జనాలను నవ్వించి, వారి రోజువారీ ఒత్తిళ్ల నుంచి కాసేపు రిలీఫ్ ఇచ్చే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు అంతర్జాతీయ వేదికలపై గౌరవం దక్కడం టాలీవుడ్‌కు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు.

