Mega Box Office Clash: టాలీవుడ్లో పండగ సీజన్ అంటేనే థియేటర్ల కోసం పెద్ద యుద్ధం జరుగుతుంది. అలాంటిది ఎంతో ముందుచూపుతో ఒక సినిమా యూనిట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటే, సరిగ్గా అదే తేదీపై మరో భారీ చిత్రం కన్నేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల హీరో ఒక్కరే కావడం. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘కాకా’ సినిమా రిలీజ్‌పై ఎప్పుడో కర్చీఫ్ వేసేయగా, ఇప్పుడు అదే డేట్‌ను ‘విశ్వంభర’ టార్గెట్ చేయడం బాక్సాఫీస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, 2027 సంక్రాంతి రేసులో అందరికంటే ముందే జనవరి 13వ తేదీని ఖరారు చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవి ఆక్వా పరిశ్రమ నేపథ్యంలో పనిచేసే సాధారణ సూపర్వైజర్ ‘కె. సత్యం’ (కదిరి కాళిదాస్) పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంతంగా ఉండే సత్యం, కొన్ని పరిస్థితుల వల్ల మళ్లీ మాస్ యాక్షన్ మోడ్‌లోకి ఎలా వెళ్లాడనేది స్టోరీ. అనస్వర రాజన్, నివేథా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
‘కాకా’ ఎప్పుడో జనవరి 13న తమ రాకను ఖరారు చేసుకోగా, ఇప్పుడు అదే తేదీపై ‘విశ్వంభర’ కన్నేయడం అసలు ట్విస్ట్. ‘బింబిసార’ ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్, సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ పనుల వల్ల ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయి. డబ్బింగ్, ట్రైలర్ ఎడిటింగ్ పనులు తుది దశకు చేరుకోవడంతో, ఈ వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దాదాపు జనవరి 13నే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఫిలింనగర్లో గట్టిగా వినిపిస్తోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, సురభి, ఇషా చావ్లా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
‘కాకా’ బుక్ చేసుకున్న జనవరి 13నే ‘విశ్వంభర’ కూడా వస్తే, బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ వర్సెస్ మెగాస్టార్ అన్నట్లుగా ‘మెగా క్లాష్’ తప్పదు. కానీ, ఒకే హీరో నటించిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు విడుదల కావడం బిజినేజ్ పరంగా ఎవరికీ లాభదాయకం కాదు. ఒకవేళ ‘విశ్వంభర’ జనవరి 13న రావడం ఖాయమైతే, ‘కాకా’ టీమ్ తమ రిలీజ్ డేట్‌ని మార్చుకుంటుందా? లేక సంక్రాంతి సెలవులను పంచుకునేలా రెండు చిత్రాల మధ్య వారం గ్యాప్ ఉండేలా నిర్మాతలు ఏదైనా సర్దుబాటు చేసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. అసలు విశ్వంభర విడుదల తేదీ ఫిక్స్ అయితే మెగా ఫ్యాన్స్‌కి సగం టెన్షన్ తిరిపోతుందని అంటున్నారు. చూడాలి మరి అధికారిక ప్రకటనతో ఎప్పుడు వస్తుందనేది.

