Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!

Kaka Vs House No 47

Kaka Vs House No 47

Kaka vs House No 47: సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ సినిమాలపై ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. వీరిద్దరి తాజా చిత్రాలు ‘కాకా’, ‘హౌస్ నంబర్ 47’లోనూ ఒకే తరహా ఫార్ములా కనిపిస్తోందనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొదట్లో సాఫ్ట్ క్యారెక్టర్లుగా కనిపించే హీరోలు.. కథలో కీలక దశలో మాస్ అవతారంలోకి మారడం ఈ రెండు సినిమాల్లోనూ కనిపించే కామన్ పాయింట్‌గా మారిందని చర్చించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్, యాక్షన్, పవర్‌ఫుల్ పాత్రలు గుర్తుకొస్తాయి. అయితే ‘కాకా’లో మాత్రం ఆయనకు ఇప్పటి వరకు ఉన్న ఇమెజ్‌కి పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఓ ఆక్వా ఫ్యాక్టరీ సూపర్‌వైజర్‌గా చాలా సింపుల్‌గా కనిపించే చిరంజీవి.. టీజర్ చివర్లో గన్స్, యాక్షన్‌కు సంబంధించిన విజువల్స్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. దీంతో ‘కాకా’ నిజంగానే పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనరా? లేక సాఫ్ట్ క్యారెక్టర్ వెనుక భారీ మాస్ ఫ్లాష్‌బ్యాక్ దాగి ఉందా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. గతంలోనూ పలువురు హీరోల సినిమాల్లో ఇదే తరహా ఫార్ములా కనిపించింది. సాఫ్ట్‌గా కనిపించే హీరోకు ఓ మాస్ గతాన్ని జోడించి కథలో ట్విస్ట్ ఇవ్వడం కొత్తేమీ కాదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘హౌస్ నంబర్ 47’ విషయంలోనూ ఇదే తరహా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించనున్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సన్నివేశాలు, కామెడీ, రిలేషన్స్, ఎమోషన్స్‌తో కథ సాగుతున్నట్లు కనిపిస్తున్న.. టైటిల్‌లోనే ‘AK47’ అనే మాస్ ఎలిమెంట్ ఉండటంతో.. ఫ్యామిలీ డ్రామా మధ్యలో క్రైమ్, యాక్షన్ ఎపిసోడ్ తప్పదనే హింట్ వస్తోంది. అయితే ఇలాంటి ఫార్ములాను ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు. మొదట సాఫ్ట్ క్యారెక్టర్‌ను చూపించి.. ఆ తర్వాత హీరో అసలు మాస్ షేడ్‌ను బయటపెట్టడం వల్ల ట్విస్ట్ ముందుగానే ఊహించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టైటిల్‌లోనే ‘AK47’ వంటి యాక్షన్ ఎలిమెంట్‌ను ప్రస్తావించడం వల్ల కథలోని సర్‌ప్రైజ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘కాకా’, ‘హౌస్ నంబర్ 47’ సినిమాల విషయంలో ఈ పాత ఫార్ములాకు డైరెక్టర్స్ ఎలాంటి కొత్త ట్రీట్‌మెంట్ ఇస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. సీనియర్ హీరోల ఇమేజ్‌కు సాఫ్ట్ క్యారెక్టర్‌తో పాటు మాస్ ఫ్లాష్‌బ్యాక్‌ను జోడించడం సేఫ్ ఫార్ములానే అయినా.. ప్రస్తుతం ప్రేక్షకులు ఆ ట్విస్టులను చాలా త్వరగా అంచనా వేస్తున్నారు. కాబట్టి కథనం, ట్రీట్‌మెంట్‌లో కొత్తదనం ఉంటేనే ఈ ఫార్ములా మరోసారి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందని సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.