ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో ఈ అరెస్టు జరిగింది. అల్లు అర్జున్ మీద మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా అందులో 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తన మేనల్లుడు అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ హుటాహుటిన తన సోదరుడు అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు .
Allu Arjun: షూటింగ్ ఆపేసి మరీ అల్లుడి కోసం రంగంలోకి చిరు
అల్లుడు అరెస్టు అయ్యాడు అనే విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి కూడా చేస్తున్న విశ్వంభర షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన బయలుదేరి వచ్చారు. తన భార్యతో పాటు అల్లు అర్జున్ నివాసానికి ఆయన కూడా వెళ్లారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు, ఒకపక్క అల్లు అరవింద్, అల్లు శిరీష్ అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ భార్య సహా పిల్లలకు మెగాస్టార్ దంపతులు ధైర్యం చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ దంపతులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోపక్క గాంధీ హాస్పిటల్ కి అల్లు అర్జున్ ని పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లగా అవి పూర్తి కావడంతో నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు.