థియేటర్లలో వస్తున్న మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించాలని, ఓటీటీలో వచ్చాక వాటిని చూసి పొగడటం వల్ల ఎవరికీ లాభం లేదని ఇటీవల చాలామంది మేకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ‘సమ్మర్ హాలిడేస్’ సక్సెస్ మీట్లో చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనదైన గోదావరి యాసలో, ఎంతో చలాకీగా మాట్లాడుతూనే టాలీవుడ్ ప్రేక్షకుల మైండ్‌సెట్‌పై అతను సంధించిన ఒక పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సక్సెస్ మీట్ వేదికపై రోహన్ మాట్లాడుతూ.. “నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ఒక కొటేషన్ చూస్తుంటాను.. ‘In search of Gold, we lost Diamonds’ (బంగారం కోసం వెతికే క్రమంలో మనం డైమండ్స్‌ను వదిలేసుకున్నాము) అని. ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా అదే చేస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలను ఇక్కడ బంగారంలా ఆదరిస్తున్నారు. వాళ్లు ఆ బంగారాన్ని వెతుకుతుంటే.. మన దగ్గర ‘సమ్మర్ హాలిడేస్’ లాంటి ఒక మంచి డైమండ్ సినిమా ఉంటే దాన్ని మిస్ చేసుకుంటున్నారు. దయచేసి థియేటర్స్‌కి వెళ్లి చూడండి. చాలామంది లిమిటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు, కానీ వెళ్లిన ప్రతి ఒక్కరికీ నచ్చుతోంది. మీరు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి, మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తేనే ఈ డైమండ్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది” అంటూ రోహన్ పలికిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో నటించే అవకాశం రావడం వెనుక ఉన్న ఫన్నీ స్టోరీని రోహన్ పంచుకున్నాడు. “డైరెక్టర్ శ్రీకర్ అన్న వాళ్ల అమ్మగారు ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేశారు. ‘నేనమ్మా.. బొక్క వాళ్ల అమ్మని మాట్లాడుతున్నా’ అన్నారు. ఆవిడ ఎవరో అర్థం కాక ఓ ఆంటీ ఎలా ఉన్నారు అంటే.. అప్పుడు చెప్పింది. ఈ సినిమాలో నన్ను తీసుకోమని శ్రీకర్ అన్నకు ఆవిడే రికమెండ్ చేశారట. అప్పుడు శ్రీకర్ అన్న.. ‘ఆ బొక (బొక్క) కుర్రాడు అంతా కామెడీ చేస్తాడే, వాడికి ఎమోషన్ రాదేమో’ అన్నాడట. కానీ ఈరోజు సినిమా చూశాక నా యాక్టింగ్‌తో శ్రీకర్ అన్న కచ్చితంగా శాటిస్ఫై అయి ఉంటాడని అనుకుంటున్నాను” అని రోహన్ సరదాగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్‌కు సంబంధించిన పాట తనను ఎంతగానో కలచివేసిందని రోహన్ ఎమోషనల్ అయ్యాడు. “సినిమాలో ‘అమ్మ’ పాట వస్తున్నప్పుడు, హర్షిని గారు అంత బాగా చేస్తుంటే మా అమ్మ కళ్లలో నీళ్లు తిరగడం, ఏడవడం నేను మొదటిసారి చూశాను. అందుకు కారణం హర్షిని గారి యాక్టింగ్. ఆమెతో కలిసి నటించడం నా అదృష్టం” అని రోహన్ కృతజ్ఞతలు తెలిపాడు. తన కో-స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అరుణ్ గురించి మాట్లాడుతూ.. “వాడు నన్ను ఎప్పుడూ ఇరిటేట్ చేస్తాడు కానీ, వాడికి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా వాడు అంటే చాలా ఇష్టం” అంటూ స్నేహబంధాన్ని చాటుకున్నాడు. చివరిగా తనను ఇంత బాగా చూపించిన డైరెక్టర్ శ్రీకర్, సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్, ఎడిటర్ సంతోష్, నిర్మాత ధీరజ్, ప్రొడక్షన్ మేనేజర్ శివతో సహా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ రోహన్ తన స్పీచ్ ముగించాడు.

