Ee Paata Korinavaaru : ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్

Ee Pata

Ee Pata

భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక సినిమా టైటిల్ ఏకంగా ఒక వాక్యం అంత పొడవుతో సంచలనం సృష్టిస్తోంది. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’ లాంటి ఎమోషనల్ అండ్ మీనింగ్‌ఫుల్ చిత్రాలను అందించిన విలక్షణ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తాజాగా ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు “ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” అనే అత్యంత భారీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అనేది ఉపశీర్షిక.

ఇదొక మొట్టమొదటి మిస్టరీ మ్యూజికల్ థ్రిల్లర్. గతంలో తన కథతో ‘ఆ నలుగురు’ లాంటి క్లాసిక్‌ను అందించిన ప్రముఖ దివంగత దర్శక రచయిత మదన్.. చనిపోవడానికి ముందు ప్లాన్ చేసుకున్న చివరి ప్రాజెక్ట్ ఇది. ఆ స్నేహంతోనే చంద్ర సిద్ధార్థ్ ఈ అరుదైన కథను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. ప్రతిరోజూ రాత్రి కచ్చితంగా పదిన్నర గంటలకు ఒక రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారం అవుతుంటుంది. ఆ పాటను కోరేది మాత్రం నెమలిపాలెంకు చెందిన రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి తదితరులు. అసలు వీరంతా ఎవరు? రోజూ ఒకే టైమ్‌కి ఆ పాటే ఎందుకు అడుగుతున్నారు? అనే ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ కథనం సాగుతుంది.

కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా.. ధ్వని (సౌండ్ థెరపీ), న్యూరోసైన్స్, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, మనిషిలోని అపరాధ భావన (గిల్ట్) వంటి సరికొత్త సైకలాజికల్ అంశాలను ఈ సినిమాలో మేళవించారు. సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ హై-కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి ప్రయోగాత్మకంగా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.