Site icon NTV Telugu

Krishnam Raju: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి, సంతాపం

Krishnam Raju Political Leaders

Krishnam Raju Political Leaders

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణం రాజు కన్నుమూశారు. తీవ్రవిషాదంలో ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబసభ్యులు. కృష్ణం రాజు మృతి పట్ల ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.

రెబల్‌ స్టార్‌, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్. యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటన్న సీఎం కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్‌. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన మృతి టాలీవుడ్‌ కు తీరలోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు.

ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు మృతికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం. ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటు.. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి-రేవంత్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరమని అన్నారు. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు నాకు అత్యంత ఆత్మీయులు. వాజ్ పేయి హాయాంలో మంత్రిగా పని చేసిన ఆయన నన్ను ఎంతగానో అభిమానించే వారని గుర్తు చేసుకున్నారు. వారు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు ప్రజల అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమని తెలిపారు.

చిత్రసీమకు కృష్ణం రాజు మృతి తీరని లోటని, ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.

ఉభయగోదావరి జిల్లా నుండి తరపున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని సోము వీర్రాజు తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణంరాజు మృతి పట్ల మొగల్తూరు వాసులు సంతాపం తెలిపారు. మొగల్తూరు సెంటర్ లో కృష్ణం రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు అభిమానులు. రెబల్ స్టార్ లేని లోటు తీర్చలేనిదని గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయని వారు గుర్తు చేశారు. కేంద్ర మంత్రులుగా సేవలందించారని వారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి సంతాప సందేశం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు, ‘రెబల్ స్టార్’గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ఇకలేరని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నటుడిగా, బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, పారిశ్రామిక వేత్తగా అవకాశం వచ్చిన ప్రతిచోటా తనదైన ముద్రవేసుకున్న మహనీయుడు శ్రీ కృష్ణంరాజు గారు. నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆలోచించిన గొప్ప మనిషి వారు. బీజేపీ పార్టీలో చేరి ఎంపీగా రెండుసార్లు (కాకినాడ, నరసాపురం) గెలిచిన శ్రీ కృష్ణంరాజు గారు నాటి గౌరవ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి నేతృత్వలోని కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ సహాయ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కోసం వారితో కలిసి పనిచేసిన సందర్భాలను, వారు చూపించిన ఆప్యాయతను ఎప్పటికీ మరువలేను.

నటుడిగా శ్రీ కృష్ణంరాజు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు 200 సినిమాల్లో తన ప్రతిభను ప్రదర్శించిన ఆయన, విలక్షణ నటుడిగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల వారికున్న బంధాన్ని వీడలేదు. నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో నిబద్ధతో మెలిగిన శ్రీ కృష్ణం రాజు తెలుగు సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. అలాంటి మంచి మనిషి మరణం బీజేపీ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు, సమాజానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Exit mobile version