సౌత్ కొరియన్ పాప్ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ తన దుమారం కొనసాగిస్తూనే ఉంది. ‘బట్టర్’ సాంగ్ తో రికార్డులు బద్ధలు కొడుతోంది. ఇతరులవే కాదు… బీటీఎస్ టీమ్ తమ స్వంత రికార్డులు కూడా తుడిచి పెట్టేస్తున్నారు. కొత్త నంబర్ వన్ ర్యాంకులతో సరిలేరు మాకెవ్వరూ అంటున్నారు!
ఇప్పటికే యూట్యూబ్, స్పోటిఫై వంటి వేదికలపైన ‘బట్టర్’ సాంగ్ లక్షలాది వ్యూస్, వేలాది స్ట్రీమింగ్స్ తో యమ స్పీడుగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా బిల్ బోర్డ్ హాట్ 100 లిస్ట్ లోనూ టాప్ సాంగ్ గా నిలిచింది. రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్స్, డౌన్ లోడ్స్ నమోదు చేసింది. దాంతో బిల్ బోర్డ్ చరిత్రలోనే ‘బట్టర్’ అత్యంత పాప్యులర్ సాంగ్ గా మారిపోయింది. మరోవైపు, రేడియోలోనూ ‘బట్టర్’ బీభత్సంగా మార్మోగుతోంది.
‘బట్టర్’ విడుదల సమయంలోనే అత్యధిక మంది చూసిన ప్రీమియర్ గా ప్రపంచ రికార్డు సృష్టించింది. యూట్యూబ్ లోనే తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సంపాదించి గత రికార్డులు చెరిపేసింది. అయితే, ఇంతకు ముందు కూడా ‘డైనమైట్’ అనే సాంగ్ తో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ బీటీఎస్ ఖాతాలోనే ఉండేది. తమ రికార్డుని యూట్యూబ్ లో తామే బద్ధలు కొట్టారు కొరియన్ బాయ్స్! మరోవైపు ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ పామ్ స్పోటిఫై కూడా ‘బట్టర్’ జోష్ తో ఇంకా ఊగిపోతూనే ఉంది!