#BoycottBhairavam… మరో ఆరు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న భైరవం సినిమా పై ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కాదు, వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన సినిమా కాదు, కానీ మరి ఈ సినిమాపై ఈ నెగెటివ్ ట్రెండ్ కి కారణం ఏంటి అనేది చాలామంది మైండ్ లో మెదులుతున్న ప్రశ్న.
దీనికి సమాధానం మాత్రం ఇప్పటిది కాదు, 2011 లో భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల సోషల్ మీడియా అకౌంట్ లో కనిపించిన ఒక పోస్ట్. 2011 లో డైరెక్టర్ విజయ్ కనకమేడల ఫేస్ బుక్ అకౌంట్ లో అమితాబ్ నటించిన ‘పా ‘ సినిమా పోస్టర్ ని రామ్ చరణ్, చిరంజీవి ఇమేజెస్ తో మార్ఫ్ చేసి ‘ఛా ‘ అనే టైటిల్ తో కనిపించింది. అది ఇప్పుడు ట్రెండ్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.అప్పట్లో ఉన్న ప్రజారాజ్యం పార్టీకి లింక్ పెట్టిన క్యాప్షన్ తో ఉన్న పోస్టర్ తో మొదలయిన రచ్చ బాయ్ కాట్ ‘భైరవం’ వరకు వెళ్ళింది.
అయితే ఈ విషయం పై భైరవం డైరెక్టర్ విజయ్ క్లారిటీ ఇచ్చారు. ‘నేను మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిని. నా కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు పనిచేసినప్పుడు ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సాయిధరమ్ తేజ్ ను పరిచయం చేసి.. మంచి కథ ఉంటే అతనితో మూవీ చేయమని అడిగారు. నేను చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలు చూసి వాళ్ల స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటిది వాళ్లను నేనెందుకు దూరం చేసుకుంటాను. 2011లో నేను నా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టినట్టు ట్రోలింగ్ జరుగుతోంది. ఆ పోస్టు పెట్టింది నేను కాదు. బహుషా నా అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చు. కానీ నా ఫేస్ బుక్ ఐడీ కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇలాంటి పొరపాటు మరోసారి జరగదు. మనస్ఫూర్తిగా చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి నా మీద, నా సినిమా మీద ట్రోలింగ్ ఆపండి’ అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కానీ మెగా ఫ్యాన్స్ శాంతించినట్టు కనిపించడం లేదు.
2011లో హ్యాక్ అయితే ఇప్పటివరకు చూసుకోలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఏలూరు సాంగ్ లో లాంచ్ సందర్భంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక పొలిటికల్ పార్టీని హర్ట్ చేశాయని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ వివాదం… అసలే ఈ సినిమా టీమ్ లో చాలామందికి కీలకం. మంచు మనోజ్ 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ ఛత్రపతి దెబ్బనుండి కోలుకోవడానికి ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు. ఇక డైరెక్టర్ విజయ్ కనకమేడల గత చిత్రం ‘ఉగ్రం’ పెద్దగా ఆడలేదు. ఈ సినిమాని రెండు సంవత్సరాలు వెచ్చించి చేసాడు.
ఇలా ఇంతమంది కెరీర్స్ కి కీలకమయిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్స్ లోకి రాబోతుంది.మరి అప్పటిలోగా ఈ వివాదాన్ని పూర్తిగా మర్చిపోయి అంతా థియేటర్స్ కి వస్తే పర్లేదు.లేదు, ఈ వివాదం ఇంకా కొనసాగితే,సినిమా టాక్ అటు ఇటుగా వస్తే మాత్రం వీళ్ళతో పాటు నిర్మాతకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.మరి ఈ భైరవం జాతకం ఎలా ఉందో ఈ నెల 30 న తేలబోతుంది.