Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!

December 4 Box Office Clash

December 4 Box Office Clash

December 4 Box Office Clash: టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీకి రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘వృషకర్మ’, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’, విష్వక్‌ సేన్‌ నటిస్తున్న ‘లెగసీ’ సినిమాలు 2026 డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. డిసెంబర్ 4న వస్తున్నాం అని ముందుగా లెగసీ టీమ్ ప్రకటించగా.. వారం తర్వాత వృషకర్మ వస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈరోజు డిసెంబర్ 4న రిలీజ్ అంటూ అలియాస్ రుక్మిణి టీమ్ ప్రకటించింది. దాంతో ఒకే రోజున మూడు సినిమాలు విడుదల కానుండటంతో.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొననుంది.

‘వృషకర్మ’పై అంచనాలు:

తండేల్‌ విజయం తర్వాత నాగచైతన్య నటిస్తున్న చిత్రం వృషకర్మ. ఈ పాన్‌ ఇండియా సినిమాని విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ దండు తెరకెక్కిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక కాగా.. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఏ మిథిక్ స్పెక్టాకిల్ అన్‌ఫోల్డ్స్’ అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్ సినిమా పౌరాణిక నేపథ్యం, భారీ విజువల్స్‌తో కూడిన కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌లో కనిపిస్తున్న నాగచైతన్య లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 4న విడుదల కానున్న వృషకర్మపై భారీ అంచనాలు ఉన్నాయి.

‘అలియాస్ రుక్మిణి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి:
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ కూడా డిసెంబర్ 4న విడుదల కానుంది. దండోరా ఫేమ్ మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీప్తి గంటా నిర్మిస్తున్నారు. సినిమా పోస్టర్‌లో నితిన్‌ను కళ్లజోడు ధరించి, చేతిలో బ్యాగ్‌తో సాధారణ యువకుడి తరహా లుక్‌లో ఉన్నారు. రుక్మిణి పాత్ర ఎవరు చేస్తున్నారనేది వచ్చే మంగళవారం తేలనుంది. వరుస ఫ్లాఫుల మధ్య నితిన్‌ ఈ సినిమాతో వస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

లెగసీపై అభిమానుల కన్ను:
విష్వక్‌ సేన్‌ హీరోగా సాయికిరణ్‌ రెడ్డి దైదా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లెగసీ’. యశ్వంత్‌ దగ్గుమాటి, సాయికిరణ్‌ రెడ్డి ఈ మూవీలో ఏక్తా రాథోడ్‌ కథానాయిక. ఆ మధ్య విడుదలైన పోస్టర్‌లో విష్వక్, ఏక్తా రొమాంటిక్‌ లుక్‌లో క్యూట్‌గా కనిపించారు. ‘రాజకీయ నేపథ్యమున్న కథతో రూపొందుతున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఎవరిది పైచేయి?
నాగచైతన్య, నితిన్, విష్వక్‌ సేన్‌ ముగ్గురికీ టాలీవుడ్‌లో ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. వృషకర్మ, అలియాస్ రుక్మిణి, లెగసీ విభిన్నమైన కథాంశంతో అలరించేందుకు సిద్దమయ్యాయి. మూడు సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. థియేటర్ల కేటాయింపు పెద్ద సమస్యగా మారనుంది. అంతేకాదు తొలి రోజు వసూళ్లపై ప్రభావం పడనుంది. మంచి టాక్ ఉన్న సినిమానే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలి.