ఎట్టకేలకు కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ పట్టాలెక్కబోతోంది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘బంగార్రాజు’ను ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నాడు నాగార్జున. ఇటీవల వచ్చిన ‘వైల్డ్ డాగ్’కి చక్కటి ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ‘బంగార్రాజు’ను జూలై నుంచి ఆరంభించబోతున్నాడట. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగ్ బంగార్రాజు పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. అప్పట్టోనే దానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా తీస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేశాడు. ఆ తరువాత ప్రీక్వెల్ కథ సిద్ధం చేసినా… వేరే కారణాల వల్ల ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది. ‘వైల్డ్ డాగ్’ ప్రచారంలోనూ ‘బంగార్రాజు’ ఉంటుందని… వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పాడు నాగార్జున. ఈ ప్రీక్వెల్ లో కూడా నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుందని, నవంబర్ కి చిత్రీకరణ పూర్తి చేసి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రావాలన్నది మేకర్స్ ప్లాన్ అట. మరి ఆ ప్లాన్ విజయవంతంగా అమలవుతుందో లేదో చూడాలి.