బాలయ్యకు సంక్రాంతి కలిసి వస్తుంది. ఏదో ఒకటి రెండు సార్లు మినహా, ఈ పండగ వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టాడు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకురావడానికి మాత్రం బాలయ్యకి కొత్త రిస్క్ వచ్చి చేరింది. దీనికి మెయిన్ రీజన్ అనిల్ రావిపూడి. అదెలాగో మీరే చూడండి. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి సినిమా విడుదల కావాల్సిందే. ఎఫ్2 (F2), సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. మన శంకరవర ప్రసాద్ తర్వాత ఐదోసారి 2027 సంక్రాంతికి వెంకీ-కళ్యాణరామ్ మూవీతో వస్తున్నాడు. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి పండుగగా మారిపోయింది. సంక్రాంతి బరిలో అనిల్ తో బాలయ్య రెండు సార్లు పోటీ పడి దెబ్బ తినాల్సి వచ్చింది. ఎఫ్2 కు పోటీగా రిలీజ్ అయిన కథానాయకుడు నిరాశ పరిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన సినిమానే సంక్రాంతి విన్నర్ అవుతుంది. ఇలాంటి సినిమాలు తీసి హిట్ కొట్టడంలో అనిల్ ఎక్స్పర్ట్. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ హిట్ అయినా, సంక్రాంతికి వస్తున్నాం హవాను తట్టుకోలేకపోయింది. సంక్రాంతికి వస్తున్నాం కంటే నాలుగు రోజుల ముందే డాకు మహారాజ్ రావడంతో బ్రేక్ ఇవెన్ అయింది. ఒకే రోజు వస్తే గట్టెక్కడం కష్టమయ్యేది.
వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ముందుగా దసరాకు రిలీజ్ చేద్దాం అనుకుంటే షూటింగ్ పూర్తి కాలేదు. సంక్రాంతికి వద్దాం అనుకుంటే అనిల్ రావిపూడి భయపెడుతున్నాడు. బాలయ్యది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ, అనిల్ ది ఫ్యామిలీ మూవీ. సంక్రాంతి బరిలో ఎన్ని దిగినా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకే అడ్వాంటేజ్ ఎక్కువ. దీంతో మరోసారి సంక్రాంతికి వచ్చి సినిమాలు కిల్ చేయకుండా, డిసెంబర్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తోంది బాలయ్య టీం. బాలయ్యకు అనిల్ నుంచే కాదు, చిరంజీవి నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. చిరంజీవితో పోటీ పడి హిట్లు కొట్టినప్పటికీ, మెగాస్టార్ మూవీ ఉంటే మాత్రం బాలయ్యకు థియేటర్స్ దొరకవు. ఈ ఎక్స్పీరియన్స్ తో కూడా బాలయ్య నిర్మాత సంక్రాంతికి వద్దు అంటున్నాడట. గతంలో చిరంజీవి, బాలకృష్ణ చాలాసార్లు ఢీకొట్టినప్పటికీ, ఈ మధ్యకాలంలో రెండు సార్లు తలపడ్డారు. గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150.. 2017 సంక్రాంతికి పోటీ పడ్డాయి. 2023 లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతికి వస్తే మెగాస్టార్ ది పైచేయి అయింది. ఎక్కువ థియేటర్స్ లో తన సినిమా ఎలా ఆడించుకోవాలో చిరంజీవికి బాగా తెలుసు. ఈ థియేటర్స్ లెక్కలో ఉన్న తేడాలు కలెక్షన్స్ లో చూపిస్తాయి. బాలయ్య ఏమో ఇవేవీ పట్టించుకోడు, నిర్మాలపై ఒత్తిడి తీసుకొచ్చే అలవాటే లేదు.
థియేటర్స్ ఎక్కువ దొరికితే ఓపెనింగ్స్ బాగుంటాయి. పోటీపడి థియేటర్స్ లేక ఓపెనింగ్స్ తగ్గించుకోవడం కంటే, బాలయ్యను సోలోగా దించడమే బెటర్ అన్న ఫీలింగ్ లో నిర్మాత ఉన్నాడు. చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయింది. మరోసారి బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవైపు అనిల్ రావిపూడి, మరోవైపు చిరంజీవితో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బాలయ్య టీం డిసెంబర్ లోనే వద్దాం అనుకుంటోంది. డిసెంబర్ 4 న వద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే, ఇంతలో ఫౌజీని డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రిస్మస్ కు షారుఖ్ ఖాన్ ‘కింగ్’ రిలీజ్ అవుతోంది. ఈ స్టార్స్ తో పోటీ లేకుండా, బాలయ్య తన సినిమా రిలీజ్ డేట్ కు ఎలాంటి ముహూర్తం పెడతాడో చూడాలి మరి.

