యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే కొరటాల శివ చిత్రానికి ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతే కాదు దాని విడుదల తేదీనీ నిర్మాతలు ప్రకటించేశారు. దాంతో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతోందట. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సైతం కారోనా కారణంగా వాయిదా పడటంతో ఈ సమయాన్ని ఎన్టీయార్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు కేటాయించాడని అంటున్నారు. ఎన్టీయార్ ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అతనికి సమ ఉజ్జీగా ఉండే విలన్ పాత్రకు చాలామందినే అనుకున్నా, చివరకు దర్శక నిర్మాతలు అరవింద స్వామి దగ్గర ఆగారని అంటున్నారు. కొరటాల శివ చిత్రంలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో విలన్ పాత్రకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన సినిమాల్లోని విలన్స్ లౌడ్ గా ఉండరు. కూల్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎన్టీయార్ చిత్రంలోనూ విలన్ పాత్రను అలానే డిజైన్ చేయడంతో దీనికి అరవింద్ స్వామి అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయానికి యూనిట్ సభ్యులు వచ్చారట. అన్ని అనుకున్నట్టు జరిగితే ‘ధృవ’ తర్వాత అరవింద స్వామి చేసే మరో స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఇప్పటికే అరవింద స్వామి ‘తలైవి’ మూవీలో ఎంజీఆర్ పాత్రను పోషించాడు. అలానే మరో ఐదారు తమిళ చిత్రాలలో నటిస్తున్నాడు. ఏదేమైనా కొరటాల శివ ఆఫర్ ఇస్తే… అతను తిరస్కరించడనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారట. చూద్దాం… ఏం జరుగుతుందో!!