Arjun Sarja: తన పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారంపై సీనియర్ నటుడు అర్జున్ సర్జా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన కూతురి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అర్జున్ స్పష్టం చేశారు. ఇటీవల అర్జున్ చిన్న కుమార్తె అంజనా వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెళ్లి వేడుకల తర్వాత ఐశ్వర్య అర్జున్ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఊహాగానాలు కాస్తా శృతి మించడంతో ఒక తండ్రిగా అర్జున్ సీరియస్ అయ్యారు.
ఈ వివాదంపై స్పందించిన అర్జున్, తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక తండ్రిగా నా కూతురిని లక్ష్యంగా చేసుకుని ఆధారాలు లేని, అవమానకరమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా ఉండలేను. నటులుగా మేము ప్రజాజీవితంలో ఉన్నప్పుడు విమర్శలు, ఊహాగానాలు సహజమని అర్థం చేసుకుంటాం. కానీ సెలబ్రిటీలం అయినంత మాత్రాన మా గురించి ఏది పడితే అది మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. ఈ అసత్య ప్రచారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం” అని అర్జున్ తేల్చి చెప్పారు.
పత్రికా రంగాన్ని తానెంతో గౌరవిస్తానని చెప్పిన ఆయన, నిజానిజాలు, విశ్వసనీయత గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఒక తండ్రిగా తన కూతురికి ఎప్పుడూ అండగా ఉంటానని చెబుతూనే, సమాజంలోని మహిళల పట్ల బాధ్యతగా ఉండాలని కోరారు. “ప్రతి మహిళ గౌరవాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా కుటుంబం నుంచి మద్దతు లేని మహిళలపై ఇలాంటి నిరాధార ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వారి జీవితాన్ని ఇవి మరింత క్లిష్టతరం చేస్తాయి. ఏ మహిళ కూడా ఇలాంటి పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదు” అని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.

