ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా షూటింగ్ స్పాట్స్, స్టూడియో నిర్మాణం, రీ-రికార్డింగ్ స్టూడియోల అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్, మరియు నంది అవార్డ్స్ వంటి ముఖ్యమైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. స్టూడియో నిర్మాణాలు జరిగితే రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. “సినిమా రంగంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా యువతకు సినీ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు కల్పించవచ్చు. దీనితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది,” అని మంత్రి పేర్కొన్నారు.
Also Read : Tollywood : డివోషనల్ టచ్ తో వస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు.. హిట్ దక్కుతుందా.?
ఈ సమావేశంలో నంది అవార్డ్స్‌పై కూడా ప్రత్యేక చర్చ జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “ఈ సంవత్సరంలోనే నంది అవార్డ్స్‌ను ప్రకటిస్తాము. దీనికి సంబంధించి రెండు, మూడు ప్రతిపాదనలపై అలోచిస్తున్నాము. అయితే, నంది అవార్డ్స్ పేరును మార్చే ఆలోచన ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నంది అవార్డ్స్ అనే పేరు ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఒక గుర్తింపుగా నిలిచింది,” అని స్పష్టం చేశారు. ఈ భేటీలో నిర్మాతలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో మరో సమావేశం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు స్నేహపూరిత వాతావరణం ఉండాలని, అందరూ కలిసి పని, చేస్తే ఆంధ్రప్రదేశ్ సినీ హబ్‌గా మరింత బలపడుతుందని నిర్మాతలు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య, కె.ఎల్. నారాయణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్, నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి వంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు.
