Anurag Kashyap: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన విభిన్నమైన సినిమాలతో ఎంతగా గుర్తింపు తెచ్చుకున్నారో.. వ్యక్తిగత జీవితంతోనూ అంతే తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే రెండు వివాహాలు ముగిసిన అధ్యాయాలుగా మారిన అనురాగ్ కశ్యప్ లైఫ్‌లో ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తనకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన శుభ్రా శెట్టితో ఆయన రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి వయసు వ్యత్యాసంపై పలుమార్లు ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆయన.. తాజాగా ఈ అంశంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడారు. శుభ్రాతో తన బంధం పుస్తకాలు, సినిమాలు, ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా మరింత బలపడిందని చెప్పారు. తమ మధ్య వయసు వ్యత్యాసం కారణంగా తాను ఒక దశలో చాలా ఇబ్బందికి గురయ్యానని వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘మా బంధంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. నాకు సిగ్గుగా అనిపించలేదు కానీ.. నా గురించి నేనే అసౌకర్యంగా ఫీలయ్యేవాడిని. ఒక దశలో శుభ్రను నా నుంచి దూరంగా ఉంచేందుకు కూడా ప్రయత్నించాను. ఆమెను చూస్తే వయసు అంతగా కనిపించదు. నా వయసు మాత్రం పెరుగుతూ వచ్చింది. అందుకే నేను చాలా సంకోచించేవాడిని’’ అని అనురాగ్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలోనే శుభ్రపై తనకు ఉన్న ప్రేమను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఆ భావనను అంగీకరించడానికి చాలా సమయం పట్టిందన్నారు. ‘‘మా తరం వాళ్లు తమ మానసిక సంఘర్షణల గురించి బహిరంగంగా మాట్లాడుకునేవారు కాదు. మనకు ఏం కావాలో తెలిసినా.. ఎదుటి వ్యక్తిని, మనల్ని మనమే అంచనా వేసుకుంటాం. ఈ బంధం ఎక్కడికీ వెళ్లదని పూర్తిగా నిర్ధారించుకోవాలని అనుకుంటాం’’ అని వెల్లడించారు. ‘‘మేము గత 11 ఏళ్లుగా కలిసి ఉన్నప్పటికీ.. ‘నిశాంచి’ షూటింగ్ సమయంలో ఆమె సెట్‌లో ఉన్నప్పుడు మాత్రమే నా మనసులో ఉన్న విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. అయితే దాన్ని అంగీకరించడానికి నాకు చాలా సమయం పట్టింది’’ అని అనురాగ్ పేర్కొన్నారు.
మరోవైపు శుభ్రా శెట్టి కూడా అనురాగ్‌తో తన సంబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనురాగ్‌తో డేటింగ్ చేస్తున్న సమయంలో తన తల్లిదండ్రులు పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్నారని ఆమె తెలిపారు. తన కంటే ఎంతో పెద్దవాడైన, గతంలో రెండుసార్లు వివాహం చేసుకున్న వ్యక్తితో తాను సంబంధంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు సహజంగానే ఆందోళన చెందారని చెప్పారు. అనురాగ్ కశ్యప్ గతంలో ఆర్తి బజాజ్, కల్కి కోచ్లిన్‌లను వివాహం చేసుకున్నారు. ఈ రెండు వివాహాలు కూడా విడాకులతో ముగిశాయి. ఆర్తి బజాజ్‌తో వివాహం ద్వారా ఆయనకు ఆలియా కశ్యప్ అనే కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం శుభ్రా శెట్టితో అనురాగ్ కొనసాగిస్తున్న సంబంధం మరోసారి బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

