Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్‌‌రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!

Raja Karuppasamy

Raja Karuppasamy

Raja Karuppasamy: తెలుగు సినిమా కథల బలం, మేకింగ్ స్థాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా దర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా తమిళంలో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ‘మోధ రాత్రి’ చిత్ర దర్శకుడు రాజా కరుప్పసామి తెలుగు సినిమా ప్రతిభపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయను ఇండియాలోనే టాప్ టాలెంట్లలో ఒకరిగా అభివర్ణించిన ఆయన, 2022లో వచ్చిన ‘అంటే సుందరానికీ!’ చిత్రాన్ని అండర్‌రేటెడ్ మాస్టర్‌పీస్‌గా వర్ణించారు. ఆ సినిమాలోని స్క్రీన్‌ప్లే, కథనం అత్యద్భుతమని కొనియాడారు.

కొత్త ముఖాలు రిషికాంత్, అనిష్మా అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రామీణ కామెడీ – ఎమోషనల్ మూవీ ‘మోధ రాత్రి’. ఆగస్టు 21న థియేటర్లలో రిలీజ్ అయ్యి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టి, గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ విభాగంలో టాప్-10లోకి దూసుకెళ్లడమే కాకుండా ఏకంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ప్రపంచ స్థాయిలో దక్కిన ఈ మైలురాయిపై ప్రముఖ హీరో కార్తి సైతం చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ భారీ విజయాన్ని తన సినీ ప్రయాణంలో ఒక ‘మాగ్నమ్ ఓపస్ క్లైమాక్స్’గా పేర్కొన్న డైరెక్టర్ రాజా కరుప్పసామి, చిన్నప్పటి నుంచే తనకు తెలుగు సినిమాలంటే విపరీతమైన ఇష్టమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ ‘అంజి’ లాంటి చిత్రాలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని గుర్తుచేసుకున్నారు. ఒక తమిళ దర్శకుడు పక్క ఇండస్ట్రీలోని కంటెంట్‌ను, ముఖ్యంగా వివేక్ ఆత్రేయ వంటి విలక్షణ దర్శకుడి కథన శైలిని ఇంతలా ప్రశంసించడం ఇరు పరిశ్రమల అభిమానుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.