సౌత్ ఇండియాని తన బీజీఎమ్లతో ఊపేస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఒకపక్క కావ్య మారన్‌తో ఆయన పెళ్లి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తుంటే, మరోపక్క అనిరుధ్ గతంలో ఎదుర్కొన్న ఓ విచిత్రమైన బ్రేకప్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోట్లాది మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న అనిరుధ్‌కి కూడా లవ్ ఫెయిల్యూర్ ఉందంటే నమ్ముతారా? అదీ కేవలం మూడు గంటల్లోనే ముగిసిపోయిన ప్రేమకథ. సాధారణంగా ఎవరి ప్రేమకథ అయినా కొన్ని నెలలో, కనీసం కొన్ని రోజులో నడుస్తుంది. కానీ మన రాక్‌స్టార్ అనిరుధ్ తొలి ప్రేమ ఆయుష్షు మాత్రం అక్షరాలా మూడే మూడు గంటలు! స్కూల్ రోజుల్లో ఒక అమ్మాయిని మనసులోనే ఆరాధించిన అనిరుధ్, ఎంతో ధైర్యం చేసి తన ప్రేమను ఆ అమ్మాయికి చెప్పేశాడట. అమ్మాయి ఓకే చెప్పిందో లేదో కానీ, ఆ ఆనందం ఆవిరయ్యేలోపే సీన్ రివర్స్ అయింది. ప్రపోజ్ చేసిన సరిగ్గా మూడు గంటల్లోనే వారి మధ్య బ్రేకప్ జరిగిపోయింది. తన జీవితంలో జరిగిన ఈ ఫన్నీ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్‌ని స్వయంగా అనిరుధ్ ఓ సందర్భంలో బయటపెట్టాడు.
అనిరుధ్ చిన్నప్పటి నుంచే చదువులో, ముఖ్యంగా లెక్కల్లో చాలా షార్ప్. కొడుకు టాలెంట్ చూసి తండ్రి రవి రాఘవేంద్ర మురిసిపోయేవారు. “నా కొడుకు ఐఐటీ మెటీరియల్, కచ్చితంగా ఐఐటీలో చదివి పెద్ద స్థాయికి వెళ్తాడు” అని అందరి దగ్గరా గొప్పగా చెప్పుకునేవారట. లయోలా కాలేజీలో బీకామ్ పూర్తి చేశాక, పైచదువుల కోసం సింగపూర్ పంపాలని పేరెంట్స్ అంతా రెడీ చేశారు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు హీరో ధనుష్. అనిరుధ్‌లో ఉన్న మ్యూజిక్ టాలెంట్‌ని పసిగట్టిన ధనుష్, నేరుగా అతని తల్లిదండ్రులతో మాట్లాడాడు. “వీడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇండస్ట్రీని ఏలుతాడు” అని వారిని ఒప్పించి, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ సినిమాతో అనిరుధ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

