బాస్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి పండగకు రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో మెగాస్టార్ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అటు చిరు.. ఇరు అనిల్ కావడంతో మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు మూడో పాటను విడుదల చేయనున్నారు. గుంటూరులో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుండగా.. అంతకుముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో అనిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
చిరంజీవి గారిని చూసినవారంతా.. ఆయన తనయుడు రామ్ చరణ్‌కు తమ్ముడా అని అడుగుతున్నారని అనిల్ రావిపూడి చెప్పారు.’ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మరోసారి తెరపై అభిమానులు ఎంజాయ్ చేస్తారు. సినిమా కోసం చిరు ఎంతో కస్టపడి తన లుక్ మార్చుకున్నారు. బాస్ లుక్ అలా రావడం నా అదృష్టం అనే చెప్పాలి. చిరంజీవి గారిని చూసినవారంతా చరణ్‌కు తమ్ముడా? అని అడుగుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్తగా కనిపించడం కోసం ఆయన పడిన శ్రమ తెరపై అందరికీ కనిపిస్తుంది. సెట్‌లో అందరూ చిరు యూత్‌ఫుల్‌గా ఉన్నారని నాతో చెప్పారు’ అని అనిల్ పేర్కొన్నారు.
‘టాలీవుడ్ ఇండస్ట్రీకి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున నాలుగు మూలస్తంభాలు. ఏ ఇద్దరు కలిసి నటించినా.. గొప్పగా ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేశ్ కలిసి సందడి చేస్తారు. ఈ సినిమా ఆడియన్స్‌ను కచ్చితంగా అలరిస్తుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి పండక్కు మరో హిట్ కొట్టబోతున్నాం’ అని అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేశారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెంకటేష్ కీలక పాత్ర చేశారు.
