Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్

Udayabhanu Acting

Udayabhanu Acting

తెలుగు బుల్లితెరపై అనతికాలంలోనే టాప్ యాంకర్‌గా ఎదిగిన ఉదయభాను, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే ఆమె బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ, కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి, ఆ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? ఈ ప్రశ్నకు ఉదయభాను ‘ఎన్టీవీ పాడ్‌కాస్ట్’ (The Podcast Show with NTV) వేదికగా ఆసక్తికరమైన, సంచలన నిజాలు వెల్లడించారు. సినిమాలకు ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్నకు ఉదయభాను సూటిగా బదులిచ్చారు. “సినిమా ఇండస్ట్రీలోని కొన్ని విషయాలు అందరికీ వర్కవుట్ కావు, నాకైతే అస్సలు కాలేదు. షూటింగ్‌లలో కొందరి చూపులు, వాళ్ల ప్రవర్తన, మాట్లాడే తీరు నాకు ఏమాత్రం నచ్చేవి కావు. ఇండస్ట్రీలో చాలా మంది చెడ్డవాళ్లు ఉంటారు. వాళ్లందరినీ తప్పించుకుంటూ, వాళ్ల ముందు జాగ్రత్తగా ఉంటూ నటించడం నావల్ల కాలేదు. ఈ టార్చర్ భరించలేకే సినిమాలు మానేశాను” అని ఉదయభాను తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.

సినిమాల్లోని ఈ వాతావరణం భరించలేకనే తాను బుల్లితెర వైపు అడుగులేశానని ఆమె స్పష్టం చేశారు. “టీవీలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఒక ఎపిసోడ్‌కు అప్పట్లో 500, 800 లేదా మహా అయితే వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్లు. పారితోషికం తక్కువే అయినా, టీవీ ఇండస్ట్రీ నాకు ఒక డిగ్నిఫైడ్ లైఫ్‌ను ఇచ్చింది. అందుకే నేను సినిమాలను పక్కనపెట్టి టీవీని ఎంచుకున్నాను” అని ఉదయభాను తన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు. వెండితెరపై అవకాశాలు వస్తున్నా.. అక్కడి చేదు అనుభవాల వల్లే బుల్లితెరలో స్టార్‌గా ఎదిగినట్లు ఆమె చెప్పిన నిజాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.