Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?

Allu Arjun Raaka

Allu Arjun Raaka

ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 కవర్‌పై అల్లు అర్జున్ సందడి చేశారు. ‘యావరేజ్ కంటెంట్‌తో నెగ్గుకు రాలేం’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ‘పుష్ప 2’తో పెరిగిన బాక్సాఫీస్ క్రేజ్; అట్లీ, లోకేష్ కనకరాజ్, సుకుమార్‌లతో రాబోయే భారీ ప్రాజెక్టులు.. ఈ నేపథ్యంలో తన పెరిగిన మార్కెట్‌కు తగినట్టు అత్యుత్తమ కంటెంట్ అందించడం బన్నీకి ఎంత పెద్ద సవాల్ కాబోతోంది? ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 కవర్‌పై తన ఫోటో రావడాన్ని అల్లు అర్జున్ ఇన్‌స్టాలో వీడియో ద్వారా షేర్ చేశాడు. టాప్ 100 ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు, కవర్ పేజీపై కూడా కనిపించాడు. దాంతో అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ మరోసారి హైలైట్ అయింది. ‘పుష్ప’ ఫ్రాంచైజ్ తర్వాత పెరిగిన నేషనల్ మార్కెట్, భారీ క్రేజ్ ఆయనను దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న స్టార్స్‌లో ఒకరిగా నిలబెట్టాయి. కానీ, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వస్తున్నాయి. యావరేజ్ కంటెంట్‌తో ఇప్పుడు ప్రేక్షకుడిని మెప్పించడం కష్టమని, బెస్ట్ అనిపించే సినిమాలు ఇవ్వడమే కీలకమని ఆయన చెప్పడం ఆయన తర్వాతి సినిమాలకే ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది.

ఎందుకంటే, అల్లు అర్జున్ ముందు ఉన్న లైనప్ అంతా భారీ అంచనాలతో నిండిపోయింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం ‘రాకా’ పేరుతో ప్రచారంలో ఉంది. కానీ ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది. డైరెక్టర్, స్టార్, భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ స్కేల్.. ఇవన్నీ సినిమాకు హైప్ తీసుకురావచ్చు. కానీ, అల్లు అర్జున్ చెప్పినట్లుగా కంటెంట్ యావరేజ్‌గా ఉంటే, ఈ కాంబినేషన్ మొత్తం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇక లోకేష్ కనకరాజ్‌తో అల్లు అర్జున్ 23వ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘పుష్ప’తో ఏర్పడిన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన జోన్‌లో అల్లు అర్జున్‌ను చూపించబోతున్నారనే చర్చ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే, లోకేష్‌కు ఉన్న క్రేజ్, అల్లు అర్జున్ మార్కెట్ రెండూ కలిసి హైప్‌ను మరింత పెంచుతున్నాయి. కానీ ఇదే హైప్ తర్వాత సినిమాకు ఒత్తిడిగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, ప్రేక్షకుడు ఇప్పుడు కేవలం ‘అల్లు అర్జున్ – లోకేష్’ అనే కాంబినేషన్ చూడడానికి మాత్రమే థియేటర్‌కి రాడు. ఆ కాంబినేషన్ నుంచి వచ్చే కంటెంట్‌పై కూడా అదే స్థాయి అంచనాలతో వస్తాడు.

ఇక ‘పుష్ప 3: ది రాంపేజ్’ మరో పెద్ద పరీక్ష. మొదటి రెండు భాగాలతో బలమైన ఫ్రాంచైజ్‌ను క్రియేట్ చేసిన తర్వాత, మూడో భాగంపై అంచనాలు మరింత భారీగా ఉంటాయి. అయితే సీక్వెల్స్ విషయంలో అసలు సమస్య ఇదే. ఒకసారి ప్రేక్షకుడు ఆ పాత్రను, ఆ ప్రపంచాన్ని అంగీకరించిన తర్వాత అదే ఫార్ములాను మరోసారి చూపిస్తే సరిపోదు. కొత్త అనుభూతి కావాలి. అందుకే ‘పుష్ప 3’కి కేవలం ‘పుష్ప’ బ్రాండ్‌ను క్యాష్ చేసుకోవడం సరిపోదు, ఫ్రాంచైజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే కంటెంట్ రావాలి. ఫోర్బ్స్ కవర్ అల్లు అర్జున్ పెరిగిన స్టార్‌డమ్‌కు గుర్తింపు కావచ్చు. ‘పుష్ప’ ఫ్రాంచైజ్ ఆయన మార్కెట్ ఎంత పెరిగిందో చెప్పొచ్చు.. కానీ పెరిగిన మార్కెట్‌ను నిలబెట్టుకోవాలంటే యావరేజ్ కంటెంట్‌తో వస్తే మాత్రం సరిపోదు. అందుకే ఫోర్బ్స్ కవర్‌తో వచ్చిన గుర్తింపును, బాక్సాఫీస్ విజయాలతో నిలబెట్టుకోవడమే ఇప్పుడు అల్లు అర్జున్ ముందున్న అసలు పరీక్ష.