2009లో విడుదలైన డేవిడ్ ధావన్, జాన్ అబ్రహాం సినిమా ‘హుక్ యా క్రూక్’లో ఎంఎస్ ధోనీ ఓ చిన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు! అయితే, సినిమా పెద్దగా ఆడకపోవటంతో ధోనీకి కూడా పెద్దగా పేరు రాలేదు…
అప్పటి తరం ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా రెండు సినిమాల్లో నటించాడు. నసీరుద్దీన్ షా ‘మాలామాల్’, మరాఠీ చిత్రం ‘సావ్లీ ప్రేమాచీ’లో ఆయన అతిథి పాత్రల్లో అలరించాడు…
2015లో విడుదలైన ఇండో ఆస్ట్రేలియన్ మూవీ ‘అన్ ఇండియన్’. ఈ సినిమాలో నటి తనిష్ఠా ముఖర్జీతో కలసి ఆసీస్ స్టార్ ప్లేయర్ బ్రెట్ లీ తెరపై కనిపించాడు…
1967లో రాజ్ కపూర్ హీరోగా ‘అరౌండ్ ద వరల్డ్’ అనే సినిమా వచ్చింది. అలాంటి పేరుతో ఓ సినిమా ఉన్నట్లు మనలో చాలా మందికి తెలియనట్లే, అందులో వెస్ట్ ఇండీస్ టాలెంటెడ్ క్రికెటర్… సర్ ఫ్రాంక్ వోరెల్ కూడా ఉన్నాడు! ఆ సంగతి కూడా చాలా మందికి తెలిసే అవకాశమైతే లేదు!
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అర్ధాంతరంగా కెరీర్ ముగించాల్సి వచ్చింది అజయ్ జడేజాకి. అయితే, క్రికెట్ క్రీజ్ నుంచీ బ్యాట్స్ మన్ గా తప్పుకున్నాక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ‘ఖేల్’ సినిమాలో సన్నీ డియోల్, సునీల్ శెట్టితో పాటూ ప్రధాన పాత్ర పోషించాడు. కానీ, అజయ్ జడేజాకి దురదృష్టవశాత్తూ ‘ఖేల్’ మూవీ వర్కవుట్ కాలేదు. దాంతో బీ-టౌన్ లో ఖేల్ ఖతం… దుకాణ్ బంద్ అనేశాడు!
పాకిస్తాన్ క్రికెటర్ మొహ్షీన్ ఖాన్ కూడా బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకున్నాడు. 1989లో ‘బట్వారా’ చిత్రంలోనూ, 1991లో ‘ఫతే, సాథీ’ చిత్రాల్లోనూ నటించాడు. పాకిస్తానీ సినిమాల్లోనూ ఆయన పలుమార్లు పెద్ద తెరపై కనిపించాడు.
ఒకప్పటి క్రేజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ క్రమంగా ఆటలో వెనుకబడ్డాడు. తరువాత బాలీవుడ్ లో లక్ చెక్ చేసుకున్నాడు. 2002లో ‘అనర్థ్’ అనే సినిమాలో నటించాడు. అయినా ‘అనర్థం’ తప్పలేదు. అది ప్లాప్ కావటంతో కెమెరాకి గుడ్ బై చెప్పేశాడు…
1983 వరల్డ్ కప్ విజయం తరువాత కపిల్ డెవిల్స్ కి ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. దాంతో వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లోని సందీప్ పాటిల్, సయ్యద్ కిర్మనీతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఏకంగా పూర్తి స్థాయి చిత్రం రూపొందించారు. అదే… ‘కభీ అజ్నభీ థే’! సందీప్ పాటిల్ హీరో, సయ్యద్ కిర్మనీ విలన్ గా నటించారు! పూనమ్ దిల్లన్, దేబాశ్రీ రాయ్ లాంటి అలనాటి అందగత్తెలు గ్లామర్ ఒలికించారు! కానీ, బాక్సాపీస్ వద్ద బాంబులా పేలిపోయింది సినిమా! అయితే, ‘కభీ అజ్నభీ థే’ సినిమాలోనే ఆనాటి యంగ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా అతిథి పాత్రలో కనిపించటం… అసలు కొసమెరుపు!
సల్మాన్, అక్షయ్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ ‘ముజ్సే షాదీ కరోగీ’. ఈ సినిమా నిజంగానే సూపర్ మల్టీ స్టారర్! ఎందుకంటే, డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఒక్క సినిమాలోనే… కపిల్ దేవ్, ఇర్పాన్ పఠాన్, జవగళ్ శ్రీనాథ్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్, పృథ్వీ పటేల్, మహ్మద్ కైఫ్, నవజోత్ సింగ్ సిద్దూ నటించారు!