Alia Bhatt Backs Deepika Padukone: బాలీవుడ్‌లో నటీనటులు, సిబ్బంది పని వేళలపై మరోసారి చర్చ మొదలైంది. రోజుకు 15 నుంచి 18 గంటల పాటు షూటింగ్‌లు నిర్వహించే విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని స్టార్ హీరోయిన్ అలియా భట్ అభిప్రాయపడ్డారు. గతంలో హీరోయిన్ దీపికా పదుకొణె మహిళా నటులకు రోజుకు ఎనిమిది గంటల పని విధానం ఉండాలని చేసిన వ్యాఖ్యలకు అలియా మద్దతు తెలిపారు. పని వేళల విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉండాలని, తమ హక్కుల కోసం గళమెత్తితే ఉద్యోగాలు కోల్పోతామనే భయం ఎవరికీ ఉండకూడదని పేర్కొన్నారు.
టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన తొలి ‘TIME 100 Next India 2026’ జాబితాలో అలియా భట్‌కు చోటు దక్కింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో పని వేళలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘నాతో పనిచేసిన నిర్మాతలంతా ఎంతో సహకరించారు. అయితే పరిశ్రమలో కొనసాగుతున్న సుదీర్ఘ పని వేళల విధానంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. పని గంటలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదు. సరైన పని వేళలు ఉంటే పనితీరు మరింత సమర్థంగా ఉంటుంది. పని గంటలపై పరిమితులు విధించుకోవడం వల్ల ఉపాధి కోల్పోతామనే భయం కార్మికులు, నటీనటుల్లో ఉండకూడదు’ అని అలియా అన్నారు.
సినిమా సెట్లలో మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని కూడా అలియా భట్ ప్రస్తావించారు. ‘సినిమా సెట్లలో మహిళలకు కనీస సౌకర్యాలు ఉండాలి. ముఖ్యంగా పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో ఉండటం ప్రాథమిక అవసరం. 2026లో కూడా సినిమా షూటింగ్ సెట్లో మహిళలకు శుభ్రమైన బాత్రూమ్ సౌకర్యం కల్పించాలా వద్దా అనే అంశంపై చర్చ జరగడం ఆశ్చర్యంగా ఉంది. సౌకర్యాలు కేవలం ప్రధాన నటీనటులకే పరిమితం కాకూడదు. మొత్తం చిత్రబృందానికి అందుబాటులో ఉండేలా వ్యవస్థలోనే మార్పులు రావాలి. సినిమా పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కనీస సౌకర్యాలు, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడం సాధారణ నిబంధనగా మారాలి’ అని ఆకాంక్షించారు.
మహిళా ప్రధాన చిత్రాలపై వస్తున్న విమర్శలపైనా అలియా స్పందించారు. పురుష కథానాయకుడితో తెరకెక్కిన సినిమా పరాజయం పాలైతే.. ఇకపై పురుషుల ప్రధాన చిత్రాలు తీయకూడదని ఎవరూ అనరని గుర్తుచేశారు. అలాంటప్పుడు మహిళా ప్రధాన సినిమాలు విఫలమైనంత మాత్రాన వాటిని ఎంచుకోవడం ఆపబోనని స్పష్టం చేశారు. ఇలాంటి సినిమాలు చేయడంలో రిస్క్ ఉంటుందని, కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాకపోవచ్చని.. అదే సమయంలో గొప్ప విజయాన్ని అందుకునే అవకాశమూ ఉంటుందని అలియా అన్నారు. ఇటీవల అలియా ‘ఆల్ఫా’ చిత్రంలో కనిపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ఆమె శిక్షణ పొందిన హంతకురాలి పాత్ర పోషించారు. జులై 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.

