అన్నాచెల్లెళ్ళ అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న సినిమా ‘రక్షాబంధన్’. అక్షయ్ కుమార్, భూమీ ఫడ్నేకర్ జంటగా ఈ సినిమా ఆనంద్ ఎల్. రాయ్ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. హిమాన్షు శర్మ, కనికా థిల్లాన్ సహ రచయితలుగా వ్యవహరిస్తున్న ‘రక్షాబంధన్’ను తన సోదరి హీరానందాని కి డెడికేట్ చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు. ఇందులో సహెజ్ మీన్ కౌర్, దీపికా ఖన్నా, సదియా ఖతీబ్, స్మృతి శ్రీకాంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
2020 ఆగస్ట్ 3 రక్షాబంధన్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినా, రెగ్యులర్ షూటింగ్ ను మాత్రం ఈ యేడాది జూన్ 21న మొదలు పెట్టారు. విశేషం ఏమంటే ఈ రోజు (అక్టోబర్ 12న) ఢిల్లీలో షూటింగ్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేశారు. ముందుగా ఈ సినిమాను ఇదే యేడాది దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తో అన్ని సినిమాల విడుదల తేదీలూ రీషెడ్యూల్ అయిన క్రమంలో ‘రక్షాబంధన్’ ను వచ్చే యేడాది ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ తో కలిసి హీరానందాని, జీ స్టూడియోస్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.