Box Office: బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టే స్టార్ హీరోలు తమ పారితోషికాన్ని పెంచడంలో వింతేమీ లేదు. బిజినెస్ బాగున్నప్పుడు అడిగినంత ముట్టజెప్పడానికి నిర్మాతలు కూడా వెనుకాడరు. కానీ, థియేటర్లలో సినిమా రాబట్టే మొత్తం వసూళ్లకు సమానంగా హీరోలు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే? సరిగ్గా ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడుతోంది. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పారితోషికాలు అమాంతం పెంచేస్తూ తమిళ అగ్ర కథానాయకులు అజిత్ కుమార్, చియాన్ విక్రమ్ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారన్న వార్త ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మార్కెట్ గత కొంతకాలంగా హెచ్చుతగ్గులతో సాగుతోంది. ‘విదాముయార్చి’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోగా, ఆ తర్వాత వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ యావరేజ్ ఫలితానికే పరిమితమైంది. అయినప్పటికీ అజిత్ తన పారితోషికం విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. గతంలో రూ. 150 కోట్లుగా ఉన్న తన రెమ్యునరేషన్‌ను ఏకే 64 కోసం ఏకంగా రూ. 180 కోట్లకు పెంచేసి అందరికీ మైండ్ బ్లాంక్ చేశాడు. ఈ భారీ డిమాండ్‌తో ప్రాజెక్ట్ చేయడానికి ముందుకొచ్చిన టాలీవుడ్ బడా మేకర్స్ సైతం ఒక్కసారిగా హడలిపోయి చేతులెత్తేశారు. అటు కోలీవుడ్ నిర్మాతలు కూడా అంత రిస్క్ చేయడానికి ముందుకు రాకపోవడంతో, అజిత్ ఏకంగా సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి తానే స్వయంగా ‘డేర్ డెవిల్’ చిత్రాన్ని నిర్మించే పనిలో పడ్డాడు. తనతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తీసిన అదిక్ రవిచంద్రన్‌కే మరోసారి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.
మరోవైపు విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. శరీరంతో ఎన్ని ప్రయోగాలు చేసినా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ లెక్కలు మాత్రం తేలడం లేదు. ఇటీవలి కాలంలో వచ్చిన ‘తంగలాన్’, ‘వీర ధీర శూరన్’ చిత్రాలు విక్రమ్ స్థాయికి తగ్గ కమర్షియల్ హిట్లను అందించలేకపోయాయి. అయినా సరే అప్పటివరకు రూ. 20 నుంచి రూ. 30 కోట్ల మధ్య తీసుకునే విక్రమ్, తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 50 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. తొలుత ఒక నిర్మాత అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ పారితోషికం వర్కవుట్ కాదని భావించి ప్రాజెక్ట్ నుంచి నిశ్శబ్దంగా తప్పుకున్నాడట. తనపై నేరుగా అంత భారీ మొత్తం ఇన్వెస్ట్ చేసేందుకు బడా ప్రొడ్యూసర్లు జంకుతుండటంతో, విక్రమ్ చివరకు రూట్ మార్చక తప్పలేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్‌తో ప్రాఫిట్ షేరింగ్ (లాభాల్లో వాటా) విధానంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా పట్టాలెక్కిన చిత్రమే ‘పవర్ హౌస్’. గతంలో ‘ఇరుముగన్’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) వంటి సక్సెస్ఫుల్ మూవీని అందించిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఊర్వశి, రియా షిబు, సంయుక్త హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో టాలీవుడ్లో రవితేజ మార్కెట్ డౌన్ అయినప్పుడు ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిని ఫాలో అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్టుతో మళ్ళీ తన డిమాండ్‌ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు చియాన్ విక్రమ్ కూడా అదే పద్ధతిలో ‘పవర్ హౌస్’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి తానేంటో నిరూపించుకుంటే తప్ప, నిర్మాతలు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ముందుకు రారు. మరి ఈ ప్రాఫిట్ షేరింగ్ ప్రయోగం విక్రమ్ కెరీర్‌కు ఎంతవరకు ఊపునిస్తుందో వేచి చూడాలి.

