బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్, యశ్ రాజ్ ఫిలిమ్స్ ఫస్ట్ కాంబినేషన్ లో దాదాపు 180 కోట్ల రూపాయలతో ఓ సూపర్ హీరో సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే ఇందులో హీరో అజయ్ దేవ్ గన్ కాదు, నూతన నటుడు ఆహాన్ పాండే! అజయ్ కేవలం విలన్ మాత్రమే. కానీ మూవీ సెట్స్ పైకి వెళ్ళక ముందే ఇప్పుడు అజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. శివ్ రావెల్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీని ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నాడట. బట్ అజయ్ దేవ్ గన్ మాత్రం ‘ట్రిపుల్ ఆర్, మైదాన్, గంగూభాయ్ ఖతియావాడీ, మే డే, థాంక్ గాడ్’ సినిమాలతో ఈ యేడాది చివరి వరకూ డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అతను ఇచ్చే డేట్స్ కు అనుగుణంగా సినిమా షూటింగ్ చేయడం కష్టమని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భావిస్తోందట. దాంతో అజయ్ స్థానంలో వేరొకరి కోసం అన్వేషణ ప్రారంభించారని తెలుస్తోంది.
స్వాతంత్రదినోత్సక కానుకగా ‘భుజ్’
ఇదిలా ఉంటే… గత యేడాది జూన్ 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తన ఓటీటీలో ఏకంగా ఏడు చిత్రాలను వరుసగా విడుదల చేస్తానని ప్రకటించింది. అందులోని ఆరవ చిత్రం ‘ది బిగ్ బుల్’ ఈ నెల 9న విడుదలైంది. సో అందరి దృష్టీ ఇప్పుడు ఏడవ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మీద పడింది. 2020లో అజయ్ దేవ్ గన్ నటించిన ‘తానాజీ: ది అన్ సంగ్ వారియర్’ విడుదలై ఘన విజయం సాధించింది. అప్పటి నుండి అజయ్ అభిమానులు కొత్త సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వారి ఎదురుచూపులకు ఈ యేడాది ఆగస్ట్ లో తెర పడబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా కథ రీత్యా దీన్ని ఆగస్ట్ 15న, స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తే బాగుంటుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ భావిస్తోందట. కానీ 15వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి 13వ తేదీ శుక్రవారం ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయొచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 1971లో జరిగిన ఇండియా – పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ‘భుజ్’ సినిమా తెరకెక్కింది. పాకిస్తాన్ ఆర్మీ బాంబు దాడిలో ధ్వంసమైన ఓ ఎయిర్ బేస్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పునర్ నిర్మించిన సమయంలో గుజరాత్ లోని ఓ గ్రామానికి చెందిన 300 మంది మహిళలు ఎలా సాయం చేశారన్నదే ఈ చిత్ర కథ. ఇందులో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహీ, శరద్ ఖేల్కర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.