‘ఆదర్శ కుటుంబం’ చాలా మంది యంగ్ హీరోస్, నిర్మాతలని ఇబ్బంది పెట్టింది. ఏమీ అనలేక కొంతమంది ప్రొడ్యూసర్స్ మౌనంగా ఉన్నా.. ఆ మధ్య నాగార్జున, లేటెస్ట్గా నిర్మాత ధీరజ్ మొగిలినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ పెద్ద సినిమా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో మీరు చూడండి. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ విషయంలో చిన్న సినిమాలను అష్టకష్టాలు పెట్టింది. సమ్మర్లో రావలసిన ఈ మూవీని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ రోజు వద్దామనుకున్న చాలా సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకొని 9కి వెళ్ళాయి. అయితే ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న రావడం లేదు, 9న వస్తుందని చెప్పడంతో.. 9న రావాల్సిన చిన్న చిత్రాలు ఈ నెల 30న విడుదల చేద్దాం అనుకుంటే, ‘ఆదర్శ కుటుంబం’ మళ్ళీ వాయిదా పడి 30న థియేటర్స్‌లోకి వస్తోంది. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్స్‌తో చిన్న నిర్మాతలకు నరకం చూపించింది. ‘ఆదర్శ కుటుంబం’ 30న రావడంతో, ఈ క్రేజీ మూవీని తట్టుకోలేక ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాను నవంబర్ 6న విడుదల చేస్తున్నారు.
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని తన సినిమా రిలీజ్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడిందో చెప్పుకొచ్చారు. పెద్ద సినిమాలు వాయిదా పడితే వాళ్లకు వాళ్లు మాట్లాడుకుంటున్నారే గానీ, చిన్న చిత్రాల గురించి ఆలోచించడం లేదని అన్నారు. “‘ఆదర్శ కుటుంబం’ను 16న రిలీజ్ చేయొచ్చు గానీ.. రెండు పెద్ద సినిమాలు రావడంతో పెద్ద సినిమా నిర్మాతలు మాట్లాడుకున్నారే గానీ, చిన్న నిర్మాతలను పట్టించుకోలేదు” అని అన్నారు. ‘సమ్మర్ హాలిడేస్’ను ముందుగా 30న రిలీజ్ చేద్దాం అనుకుని ప్రమోషన్ స్టార్ట్ చేశామని, ఇప్పుడు మరో రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రమోషన్ కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు నిర్మాత. 5న ‘రామాయణ’ రిలీజ్ అవుతున్నా, ‘ఆదర్శ కుటుంబం’కు ఎక్కువ క్రేజ్ ఉండడంతో వెంకటేష్‌తో పోటీ పడడం కంటే హిందీ మూవీతో రావడం బెటర్ అనిపించిందన్నాడు.
‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ వాయిదాలతో ‘ఇట్లు అర్జున’ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. థియేటర్స్‌లోకి వద్దామనుకున్న ప్రతిసారీ ‘ఆదర్శ కుటుంబం’ అడ్డుపడింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రెజెంటర్ నాగార్జున మాట్లాడుతూ.. “30న ‘ఆదర్శ కుటుంబం’ వచ్చినా వచ్చేస్తాం” అన్నాడు. ‘ఆదర్శ కుటుంబం’ 30న వస్తున్నా, విశ్వక్ సేన్ తగ్గేది లేదంటున్నాడు. మెగాఫోన్ పట్టి తీసిన ‘కల్ట్’ను అక్టోబర్ 30న రిలీజ్ చేసేస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత, 30నే వస్తున్నట్లు పోస్టర్‌తో ‘కల్ట్’ టీమ్ కన్ఫర్మ్ చేసింది. సినిమా ట్రైలర్‌ను రీసెంట్గా రిలీజ్ చేయగా వైలెన్స్‌తో నింపేశాడు. మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ను, యాక్షన్ మూవీ ‘కల్ట్’ తట్టుకుంటుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉంది. 30న రిలీజ్ అవుతున్న ‘ఆదర్శ కుటుంబం’ను తట్టుకోలేకపోయిన చిన్న సినిమా ‘సమ్మర్ హాలిడేస్’ నవంబర్ 6కు వెళ్ళిపోయినా.. నిర్మాత ఫ్రీ కాలేకపోయాడు. 30న వస్తున్న ‘ఇట్లు అర్జున’, ‘కల్ట్’ చిత్రాలు ఎక్కడ వాయిదా పడి మళ్లీ నవంబర్ 6కే వస్తాయో అన్న భయమైతే లేకపోలేదు. మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’తో ‘ఇట్లు అర్జున’, ‘కల్ట్’ పోటీ పడతాయా? లేదంటే చిన్న సినిమాలన్నీ ఒకేసారి దీపావళికి వస్తాయో చూడాలి మరి.

